28 ఏళ్ల తర్వాత ఒకే రోజు రెండు మ్యాచ్‌లు: గిల్ సేన ఇక్కడ.. అయ్యర్ టీమ్ అక్కడ.. ఆ రోజే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే!

28 ఏళ్ల తర్వాత ఒకే రోజు రెండు మ్యాచ్‌లు: గిల్ సేన ఇక్కడ.. అయ్యర్ టీమ్ అక్కడ.. ఆ రోజే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే!

Team India Two Matches Same Day: జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ అధికారికంగా రిలీజ్ అయింది. ఐసీసీ ర్యాంక్ కారణంగా భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ ఆడనుంది. కానీ ఈ షెడ్యూల్ ప్రకారం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత ఆవిష్కృతం కానుంది. అక్టోబర్ 3వ తేదీన టీమిండియా ఒకే రోజు రెండు వేర్వేరు దేశాల్లో, రెండు వేర్వేరు జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఆసియా గేమ్స్ 2026 ఫైనల్‌కు ఇండియా చేరితేనే ఈ చారిత్రాత్మక ఘనత సాధ్యమవుతుంది.

రెండు జట్లు.. ఇద్దరు కెప్టెన్లు: శ్రేయస్, గిల్ సేనల పోరు: 

అక్టోబర్ 3వ తేదీన జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్ ఫైనల్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు తలపడనుంది. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. సంజు శాంసన్, బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడనున్నారు. అదే రోజు భారత్‌లోని న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత వన్డే టీమ్ బరిలోకి దిగనుంది. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ దిగ్గజాలు ఆడనున్నారు.

28 ఏళ్ల తర్వాత మళ్లీ సీన్ రిపీట్: 

భారత క్రికెట్ చరిత్రలోనే ఒకే రోజు రెండు వేర్వేరు భారత జట్లు మ్యాచ్‌లు ఆడటం ఇది రెండోసారి కావడం విశేషం. సరిగ్గా 28 ఏళ్ల క్రితం (1998 సెప్టెంబర్ 12న) కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఒక భారత జట్టు ఆడగా.. టొరంటోలో జరిగిన సహారా కప్‌లో మరొక ఇండియన్ టీమ్ తలపడింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అక్టోబర్ 3వ తేదీన అలాంటి సన్నివేశమే పునరావృతం కాబోతుండటంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ALSO READ : ఒక్క మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు: బీసీసీఐతో చాట్‌జీపీటీ బిగ్ డీల్..

768 మందితో జపాన్‌కు పయనం: 

ఈసారి ఆసియా గేమ్స్ 2026 కోసం భారత్ నుంచి ఏకంగా 768 మందితో కూడిన భారీ బృందం జపాన్‌కు వెళ్తోంది. ఇందులో 503 మంది అథ్లెట్లు, 246 మంది కోచ్‌లు ఉన్నారు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల సారథ్యంలోని భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించగా.. ఈసారి కూడా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గోల్డ్ మెడల్ సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.