నా డబ్బులు ఎగ్గొట్టారు.. నన్ను ఘోరంగా అవమానించారు: పాక్ బోర్డుపై ఆస్ట్రేలియా దిగ్గజం హాట్ కామెంట్స్!

నా డబ్బులు ఎగ్గొట్టారు.. నన్ను ఘోరంగా అవమానించారు: పాక్ బోర్డుపై ఆస్ట్రేలియా దిగ్గజం హాట్ కామెంట్స్!

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆధిపత్య ధోరణి, అంతర్గత కుట్రలపై ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం, పాక్ మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ జట్టుకు శిక్షణ ఇచ్చిన సమయంలో తనను ఘోరంగా అవమానించారని, టీమ్‌లో తన పాత్రను పూర్తిగా తీసిపారేసి కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు ఇవ్వాల్సిన వేల డాలర్ల జీతం డబ్బులని పీసీబీ ఇప్పటివరకు చెల్లించకుండా ఎగ్గొట్టిందని ఆరోపించాడు. బోర్డు చెప్పిన ప్రతిదానికీ తల ఊపేందుకు తాను సిద్ధం లేనన్నారు. తన సూత్రాలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు.

ఆకిబ్ జావేద్ వెన్నుపోటు పొడిచాడు: 

పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా ఆకిబ్ జావేద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తన పరిస్థితి దారుణంగా తయారైందని గిలెస్పీ ఆరోపించారు. నేను జట్టును నడిపించే స్థాయి నుంచి ఏ అధికారమూ లేనివాడిగా మిగిలిపోయాను.. ఆకిబ్ జావేద్ నా వెనుక ఉండి నాపై కుట్రలు చేశాడు.. మైండ్ గేమ్స్ ఆడుతూ నాపై నిరంతరం విషం కక్కాడు.. ఇప్పటికీ నా ప్రదర్శనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు.. అతను నాపై నెగెటివ్‌గా మాట్లాడటం ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నాడు. అతడిపై కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానని గిలెస్పీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

డిప్రెషన్‌లోకి నెట్టేశారు.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: 

పాకిస్థాన్ బోర్డులో ఎదురైన ఈ చేదు అనుభవాలు తన మానసిక ప్రశాంతతను దెబ్బతీశాయని జేసన్ గిలెస్పీ స్పష్టం చేశారు. పీసీబీలోని నెగెటివ్ వాతావరణంతో తనపై తనకే అనుమానం వచ్చిందని, అసలు కోచింగ్ వృత్తిలోనే కొనసాగాలా వద్దా అనే తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. గ్యారీ కిర్‌స్టన్, తాను జట్టును నాశనం చేశామంటూ ఆకిబ్ జావేద్ నిందలు వేయడంపై మండిపడ్డారు. బోర్డు పెద్దల అండ చూసుకుని ఆకిబ్ విర్రవీగుతున్నాడని, ఇతరుల అభిప్రాయాలకు అక్కడ అస్సలు విలువ లేదని దుయ్యబట్టారు.

ఆకిబ్ ఉన్నంత కాలం పాక్ క్రికెట్ నాశనమే: 

పాకిస్థాన్ క్రికెట్ రోజు రోజుకూ దిగజారిపోవడానికి ఆకిబ్ జావేదే ప్రధాన కారణమని గిలెస్పీ స్పష్టం చేశారు. ఆకిబ్ అక్కడ ఉన్నంత కాలం పాక్ క్రికెట్ ఎప్పటికీ ముందుకెళ్లదు, వెనక్కే పోతుంది. ఏసీ గదుల్లో కూర్చునే బోర్డు పెద్దలు మైదానంలో ఆడే కెప్టెన్లను ఎంపిక చేయడం ఏంటి? ఇది ముమ్మాటికీ మూర్ఖత్వం.. సరైన కోచ్‌ను నియమించి అతనికి పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే జట్టు బాగుపడుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ ఒక పెద్ద గందరగోళంలో కూరుకుపోయిందని పాక్ క్రికెట్ పతనంపై జేసన్ గిలెస్పీ విశ్లేషించారు.

ALSO READ : కోచ్ అయితే విడాకులే.. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్!