హైదరాబాద్: అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. నిన్న చేసిన వ్యాఖ్యలతో తాను తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.
హరీశ్ రావుకు మైక్ ఇచ్చినప్పుడు ఆయన క్షమాపణ చెబుతారని భావించామని, అయితే అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని స్పీకర్ పేర్కొన్నారు. దీంతో తాను సీరియస్‌గా స్పందించాల్సి వచ్చిందన్నారు. తనకు చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, అలా చేయడం సభా సంప్రదాయం కాదని గడ్డం ప్రసాద్ అన్నారు. హరీశ్ రావు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారని, కనీసం ఈ అంశంపై స్పందించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని వ్యాఖ్యానించారు.
సభా వ్యవహారాల్లో ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తూ ముందుకు వెళ్తామని స్పీకర్ తెలిపారు. సభా సంప్రదాయాలను కేసీఆర్ గౌరవించాలని సూచించారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్యానల్ స్పీకర్‌గా కడియం శ్రీహరి వ్యవహరిస్తారని గడ్డం ప్రసాద్ వెల్లడించారు.
కేటీఆర్, కౌశిక్ రెడ్డి పోలీసులపై దాడి చేస్తున్నట్లుగా కనిపించే వీడియోలు ఉన్నాయని స్పీకర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కూడా నిబంధనల ప్రకారం పరిశీలన జరుగుతుందని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ALSO READ ; కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
టీషర్టులపై వివిధ రాతలు, నినాదాలతో అసెంబ్లీకి రావొద్దన్న నిబంధనను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టిందని స్పీకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం తాము అదే నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు.పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ అదానీ బొమ్మతో వెళ్లలేదని ఈ సందర్భంగా స్పీకర్ వ్యాఖ్యానించారు.
సభలో ప్రతి ఒక్కరూ నిబంధనలు, సంప్రదాయాలను గౌరవించాలని గడ్డం ప్రసాద్ సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Speaker Gaddam Prasad ,KCR,Assembly,apologize,telugu news,telangana poltics,telugu news,latestnews
