సత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. రోడ్డున పడ్డ స్టూడెంట్స్‌కు ఆశ్రయమిచ్చిన ఢిల్లీ వర్సిటీ!

సత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. రోడ్డున పడ్డ  స్టూడెంట్స్‌కు ఆశ్రయమిచ్చిన ఢిల్లీ వర్సిటీ!

ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ భవనం కూలిన దుర్ఘటన విద్యార్థులను రోడ్డున పడేసింది. ఈ ప్రమాదం కారణంగా ఆశ్రయం  కోల్పోయి నిరాశ్రయులైన విద్యార్థులను ఆదుకునేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU)  పరిధిలోని పలు కాలేజీలు ముందుకొచ్చాయి.  

 ప్రమాదం కారణంగా నివాసం కోల్పోయిన విద్యార్థుల కోసం డీయూ అధికారులు స్పందించి, కాలేజీల్లో క్లాసులు తాత్కాలికంగా నిలిపివేశారు. క్లాస్ రూంలు, ఆరోగ్య కేంద్రాలు, స్టాఫ్, అతిథి గదులను విద్యార్థులకు వసతి గదులుగా మార్చారు. రూంలలో  భోజన వసతి కూడా  కల్పించారు.

శ్రీ వేంకటేశ్వర కళాశాల, మోతీలాల్ నెహ్రూ, జీసస్ అండ్ మేరీ, ఆత్మ రామ్ సనాతన ధర్మ, మైత్రేయి, రామ్ లాల్ ఆనంద్, భగత్ సింగ్, ఆర్యభట్ట వంటి పలు కాలేజీలు విద్యార్థులకు ఆశ్రయం, ఆహారం, వైద్యం, కౌన్సెలింగ్ అందిస్తున్నాయి. సౌత్ క్యాంపస్ డైరెక్టర్ రజనీ అభి నేతృత్వంలో ప్రిన్సిపాల్స్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి సహాయక చర్యలను సమన్వయం చేశారు.

ప్రభావిత ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులను గుర్తించి సురక్షితంగా క్యాంపస్‌కు రప్పించాలని డీయూ కాలేజీలను ఆదేశించింది. అమ్మాయిలకు ఏ కాలేజీలోనైనా ఆశ్రయం కల్పిస్తుండగా, అబ్బాయిలకు మాత్రం ఐడెంటిటీ వెరిఫికేషన్ తర్వాత వారి వారి కాలేజీల్లోనే వసతి ఇస్తున్నారు. వివిధ కాలేజీల ఎన్‌సీసీ వృందాలు, వాలంటీర్లు రంగంలోకి దిగి నీరు, ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు.

పక్కనే ఉన్న భవనంలో ఉంటున్న ఒడిశా విద్యార్థిని అనన్య మాట్లాడుతూ.. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చి భవనం పక్కకు ఒరిగిపోవడంతో ప్రాణభయంతో బయటకు పరుగెత్తినట్లు చెప్పింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఒక విద్యార్థి షాక్‌కు గురికావడంతో అతనికి కౌన్సిలింగ్ ఇప్పించారు. వెంకటేశ్వర కాలేజీలో 72 మంది, మోతీలాల్ నెహ్రూ కాలేజీలో దాదాపు 50 మంది విద్యార్థులు రాత్రి బస చేశారు. చాలా మంది విద్యార్థులు వాళ్ళ  స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

విద్యార్థి సంఘాల నిరసనలు: హాస్టల్ సౌకర్యం సరిగా లేక బయట పీజీల్లో ఉండాల్సి వస్తోందని, భవనాల భద్రతపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు (ABVP, NSUI, SFI, AISHA, ASAP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాయి. లా సెంటర్‌లో మృతిచెందిన విద్యార్థులకు సంతాపం తెలిపాయి.