BCCI ChatGPT Sponsor: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (BCCI)తో దిగ్గజ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ (ChatGPT) మైండ్ బ్లాకింగ్ డీల్ కుదుర్చుకుంది. భారత్ వేదికగా జరిగే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. 2028 మార్చి వరకు కొనసాగే ఈ డీల్ కోసం చాట్‌జీపీటీ ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ.1.2 కోట్లు చెల్లించనుంది. సాధారణంగా కూల్ డ్రింక్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రకటనలు కనిపించే క్రికెట్ ప్రసారాలలో.. ఒక ఏఐ ప్లాట్‌ఫామ్ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఎంట్రీ ఇవ్వడం క్రీడా, టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది.
వేలంలో రిలయన్స్ క్యాంపా కోలా హవా:
ఈ అసోసియేట్ పార్ట్నర్షిప్ కోసం బీసీసీఐ నిర్వహించిన వేలం పాట అత్యంత హోరాహోరీగా కొనసాగింది. దిగ్గజ సంస్థల మధ్య జరిగిన ఈ బిడ్డింగ్ రేసులో రిలయన్స్‌కు చెందిన క్యాంపా కోలా ఒక్కో మ్యాచ్‌కు రూ.1.31 కోట్లు బిడ్ వేసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రూ.1.2 కోట్ల వరకు బిడ్ వేసిన ప్రముఖ వాటర్ బ్రాండ్ బిస్లరీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కంపెనీలు రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరికి క్యాంపా కోలాతో పాటు చాట్‌జీపీటీ, ఎస్బీఐ లైఫ్ సంస్థలు రూ.1.2 కోట్ల బిడ్‌తో బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్షిప్ హక్కులను కైవసం చేసుకున్నాయి.
ఆగస్టు 2026తో ముగిసిన టైటిల్ స్పాన్సర్షిప్:
అసలు బీసీసీఐకి ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే టైటిల్ స్పాన్సర్షిప్ ఒప్పందం ఆగస్టు 2026తోనే ముగిసింది. కొత్త టైటిల్ స్పాన్సర్ వేట ఆలస్యం అవుతుండటంతో, బోర్డు ఆదాయానికి గండి పడకుండా ఉండటానికి బీసీసీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రధాన టైటిల్ స్పాన్సర్ చర్చలు నడుస్తుండగానే, ముందుగా ఈ అసోసియేట్ పార్ట్నర్స్ ఎంపికను పూర్తి చేసి భారత క్రికెట్ బోర్డు ఖజానాకు భారీగా నిధులు సమకూరేలా ప్లాన్ చేసింది.
ALSO READ : నా డబ్బులు ఎగ్గొట్టారు.. నన్ను ఘోరంగా అవమానించారు
మూడు విభాగాలుగా స్పాన్సర్షిప్:
బీసీసీఐ తన టైటిల్ స్పాన్సర్, అఫీషియల్ జెర్సీ పార్టనర్, అసోసియేట్ పార్ట్నర్స్ అని మూడు విభాగాలుగా విభజిస్తుంది. ఇందులో అసోసియేట్ పార్ట్నర్గా ఎన్నికైన చాట్‌జీపీటీ బ్రాండింగ్ మైదానంలోని బౌండరీ బోర్డులు, డిజిటల్ స్క్రీన్లు, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ బ్యాక్‌డ్రాప్‌లలో కనిపించనుంది. భారత క్రికెట్ క్రేజ్‌ను వాడుకుని దేశీయ ఏఐ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా చాట్‌జీపీటీ ఈ చారిత్రాత్మక డీల్‌ను కుదుర్చుకుంది.
