క్రెడిట్ కార్డ్ అంటేనే వణికిపోతున్న ఉద్యోగులు.. అప్పుల కోసం కొత్తగా ఏం చేస్తున్నారంటే?

క్రెడిట్ కార్డ్ అంటేనే వణికిపోతున్న ఉద్యోగులు.. అప్పుల కోసం కొత్తగా ఏం చేస్తున్నారంటే?

ప్రస్తుతం శాలరీడ్ ఉద్యోగుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులంటేనే భయపడిపోతున్నారు. కార్డు వాడితే ఎక్కడ అప్పుల ఊబిలో చిక్కుకుంటామోననే ఆందోళనే దీనికి ప్రధాన కారణం. మెుదట్లో సరదాగా తీసుకున్న క్రెడిట్ కార్డు ఆ తర్వాత పెద్ద గుదిబండగా మారి అప్పుల ఊబిలోకి నెట్టేస్తుండటంతో చాలా మంది అప్రమత్తం అవుతున్నారు. బిల్ వచ్చాక కట్టేయెుచ్చులే అని మెుండి ధీమాతో కార్డు వాడాక సకాలంలో పూర్తి బిల్లు చెల్లించకపోతే భారీ వడ్డీలు పడటం, మినిమం డ్యూ కట్టినా బ్యాలెన్స్ అలానే ఉండిపోవడం వల్ల అప్పు కొండలా మారుతుంటంపై కళ్లు తెరుస్తున్నారు వేతనజీవులు. అందుకే ఆర్థిక అవసరాలను తీర్చుకోవటానికి కార్డులు వద్దంటూ వేరే మార్గాలను ఎంచుకుంటున్నారని తేలింది.

మారిన ట్రెండ్స్:
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో శాలరీడ్ ఎంప్లాయ్స్ కేవలం క్రెడిట్ కార్డులపైనే ఆధారపడటం తగ్గించేశారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం కూడా పర్సనల్ లోన్స్ వాడకం భారీగా పెరుగుతుండగా.. క్రెడిట్ కార్డుల బ్యాలెన్స్ వృద్ధి మందగించింది. అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు రివాల్వింగ్ క్రెడిట్‌లో పడి ఇబ్బంది పడటం కంటే.. ఒక నికరమైన కాలపరిమితి ఉండే షార్ట్-టర్మ్ లోన్ తీసుకోవడం మేలని చాలా మంది భావిస్తున్నారు. 

చిన్న లోన్ల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు..
గతంలోలాగా బ్యాంకు చుట్టూ తిరిగి లోన్ కోసం అప్లికేషన్లు ఇచ్చే రోజులు ఇప్పుడు పోయాయి. రూ.35వేల నుంచి రూ.50వేల వరకూ చిన్న మొత్తాల అవసరం ఉన్నా సరే.. డిజిటల్ లెండింగ్ యాప్స్ ద్వారా క్షణాల్లో లోన్లు పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఫుల్ టైం ఉద్యోగం ఉండి.. నెలకు కనీసం రూ.20 వేల వేతనం బ్యాంకు అకౌంట్లో పడుతుంటే చాలు.. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే తక్షణాల్లో లోన్ అమౌంట్ బ్యాంకులో పడిపోతోంది. 

క్రెడిట్ కార్డుల్లో ఉండే హిడెన్ ఖర్చులు, ఛార్జీలు డిజిటల్ పర్సనల్ లోన్లలో ఉండవు. లోన్ తీసుకునే ముందే ప్రాసెసింగ్ ఫీజు, ఎంత వడ్డీ పడుతుందనే పూర్తి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కించడం వల్ల.. మనం ముందే లోన్ క్లోజ్ చేస్తే ఆ రోజు వరకు మాత్రమే వడ్డీ చెల్లించాలి. ఎలాంటి ముందస్తు ప్రీ-పేమెంట్ ఛార్జీలు లేకపోవడం ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తోంది.

ALSO READ : శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్

ఈ తరహా ఇన్‌స్టంట్ లోన్ల కోసం భారీ క్రెడిట్ హిస్టరీ కూడా అవసరం లేదు. కేవలం ఆధార్ ఓటీపీ, సెల్ఫీ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసి, శాలరీ ప్రూఫ్స్ చూపిస్తే సరిపోతుంది. ఏ ఒక్క బ్రాంచ్‌కి వెళ్లకుండానే కేవలం 15 నిమిషాల్లోనే నేరుగా ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తుండటంతో.. ఎమర్జెన్సీ ఖర్చుల కోసం ఉద్యోగులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

తెలివైన నిర్ణయం..
క్రెడిట్ కార్డు బిల్లులను ప్రతి నెలా సరిగ్గా డ్యూ డేట్‌కు పూర్తిగా చెల్లించగలిగితేనే అది ప్రయోజనకరం. లేదంటే అది అప్పుల ఊబిగా మారుతుంది. అందుకే ఉద్యోగులు ఒక నిర్దిష్ట గడువు, స్పష్టమైన రీపేమెంట్ ఆప్షన్ ఉన్న పర్సనల్ లోన్స్ వైపు మళ్లుతున్నారు. ఏది ఏమైనా.. ఆర్థిక అవసరాల కోసం అప్పు చేసే విషయంలో నేటితరం ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పుకోవాలి. గుడ్డిగా క్రెడిట్ వాడేయటం తీరా కట్టాల్సిన సమయం వచ్చేటప్పడికి ఒత్తిడి ఫీల్ అవ్వటం ఎందుకని ప్రస్తుతం ఉద్యోగులు అంటున్నారు.