టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత సుస్మితకు మరో అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బాధ్యత ద్వారా సుస్మిత ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ సమగ్ర అభివృద్ధి, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో తనవంతు క్రియాశీలక సూచనలు, సేవలు అందించనున్నారు. మరో వైపు మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులోకి సుస్మిత కొణిదెల ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖను నియమించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి. మెగా కుటుంబానికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం, సామాజిక ప్రాధాన్యత కారణంగా వారి నియామకం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో సుస్మితకు ఈ పదవి దక్కడంతో తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక రంగంలోనూ మెగా కుటుంబం మార్క్ స్పష్టమవుతోంది.
సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుస్మిత, మొదట ఫ్యాషన్ డిజైనర్‌గా చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్స్ రూపొందించారు. అనంతరం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ స్థాపించి వెబ్ సిరీస్‌లు, చిత్రాలు నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతికి తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ఆమె నిర్మించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, నిర్మాతగా ఆమె స్థాయిని పెంచింది.
ఓ వైపు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతూ.. మరోవైపు అత్యంత పవిత్రమైన ఇంద్రకీలాద్రి దేవుని సేవలో భాగస్వామి కావడంపై మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సుస్మితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
