పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం పెరుగుతున్న కొద్దీ.. మనం వాడే పెర్ఫ్యూమ్స్, డియోడరెంట్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్న వెనుక ఆల్కహాల్ సరఫరా, తయారీ ఖర్చులు, ప్రభుత్వ పన్నుల విధానం వంటి కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. అసలు ఇథనాల్ వాడకానికి.. సుగంధ ద్రవ్యాల ధరలకు ఎలాంటి సంబంధం ఉందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు తయారు చేయడంలో ఆల్కహాల్ ప్రాథమిక బేస్‌గా పనిచేస్తుంది. ఇది సుగంధాన్ని శరీరంపై వ్యాపించడానికి సహాయపడుతుంది. తయారీదారులు ప్రధానంగా ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, డినేచర్డ్ స్పిరిట్‌ను ఉపయోగిస్తారు. ఇథనాల్ డిమాండ్ పెరిగినప్పుడు.. ఈ ముడిసరుకు కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయని కాస్మెటిక్స్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుతానికి మాత్రం ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ సీజన్‌లో చెరకు రసాన్ని ఇథనాల్ కంటే చక్కెర ఉత్పత్తికే ఎక్కువ మళ్లించారు. దీనివల్ల మొలాసిస్, ఈనా సరఫరా సాధారణంగానే ఉంది. అంతేకాకుండా పెర్ఫ్యూమ్ ధరలో ఆల్కహాల్ అనేది కేవలం ఒక భాగం మాత్రమే. బాటిల్స్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, పెర్ఫ్యూమ్ ఆయిల్స్, పన్నులు కూడా ధరను నిర్ణయిస్తాయి. చిన్నపాటి వ్యత్యాసాలకు కంపెనీలు ధరలను మార్చవు.
ధరల పెరుగుదల ప్రభావం అన్ని ఉత్పత్తులపై సమానంగా ఉండదు. తక్కువ ధరలో లభించే డియోడరెంట్లు, బాడీ స్ప్రేలు ఎక్కువ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తాయి. తక్కువ లాభాల మార్జిన్‌తో నడుస్తాయి. ముడిసరుకు ఖర్చులు భారీగా పెరిగితే ఈ బ్రాండ్లు ఇబ్బంది పడవచ్చు. ఇక ఖరీదైన డిజైనర్ పెర్ఫ్యూమ్స్‌లో ఆల్కహాల్ భాగం తక్కువగా ఉండటం వల్ల వాటిపై ప్రభావం చాలా తక్కువగా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ : డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్, RC రద్దు.. కొత్త విధానం తెస్తున్న కేంద్రం
అసలైన ముప్పు ఇథనాల్ వల్ల కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల పన్ను విధానాల వల్లే వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌పై పన్ను విధించే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నట్లు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు కనుక రెక్టిఫైడ్ స్పిరిట్‌పై సుంకాలు పెంచితే.. తయారీదారులపై భారం పెరిగి అది నేరుగా వినియోగదారుల జేబులపై భారం మోపుతుంది. ప్రస్తుతానికి అయితే పెర్ఫ్యూమ్స్ ధరలు పెరిగే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ20 పెట్రోల్‌కి లింక్ ఉన్నప్పటికీ రేట్లు హడావిడిగా పెరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది.
