హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకోవడం తనను ఎంతో బాధించిందని అన్నారు. ప్రజాప్రతినిధులు సభలో వ్యక్తిగత దూషణలకు దిగడం, అనుచిత భాష ఉపయోగించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.అమ్మను తిట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించిన కూనంనేని.. బూతులు మాట్లాడితే ప్రజలు ఆకర్షితులవుతారనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉండే వారికి రాజకీయాలు తెలియవని భావించడం కూడా సరికాదన్నారు.
హరీశ్ రావు వంటి నేతలు సభలో చొక్కా విప్పడం తీవ్రంగా అభ్యంతరకరమని కూనంనేని పేర్కొన్నారు. పొడవు, మరుగుజ్జు అంటూ వ్యక్తిగతంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలు వ్యక్తిగత విమర్శలతో అగౌరవ సభలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ నేత తాతా మధు మాట్లాడిన భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందని కూనంనేని అన్నారు. మాట్లాడిన తర్వాత 'మీరు భావిస్తే' అంటూ సమర్థించుకోవడం సరికాదని పేర్కొన్నారు. తప్పు జరిగిందని భావిస్తే వెంటనే క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదన్నారు.
కేసీఆర్ అయినా ఈ అంశంపై ముందుకొచ్చి మాట్లాడి ఉంటే బాగుండేదని కూనంనేని అభిప్రాయపడ్డారు. గతంలో రాజీవ్ గాంధీ హత్యకు పాల్పడిన వారికి క్షమాభిక్ష పెట్టాలన్న సంస్కారం కాంగ్రెస్‌దేనని వ్యాఖ్యానించారు.నిన్న జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని కూనంనేని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు శాసనసభలో ఒకరినొకరు తిట్టుకోవడం పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇలాంటి భాష, ప్రవర్తనకు ఇదే చివరి రోజు కావాలని అన్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా అసెంబ్లీ పరిణామాలపై స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రేరేపితంగానే బీఆర్ఎస్ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయని ఆరోపించారు.బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి వెయ్యి రోజులు అవుతున్నా ఆ పార్టీ నేతల గర్వం తగ్గలేదని విమర్శించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల అంశం కేవలం రాజకీయ వివాదం కాదని, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు.ఈ వ్యవహారంపై కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ స్పందించలేదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు తమను కొట్టారంటూ నిన్న కొందరు బీఆర్ఎస్ నేతలు ఫేక్ బ్యాండేజీలు కట్టుకున్నారని ఆరోపించారు.
స్పీకర్‌పై వ్యాఖ్యలు బాధాకరం: అనిరుధ్ రెడ్డి
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనను చీకటి రోజుగా అభివర్ణించారు.స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యలు దళితులందరికీ జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని అనిరుధ్ రెడ్డి అన్నారు. హత్య చేసిన తర్వాత 'సారీ' చెబితే కేసు మాఫీ అవుతుందా? అని ప్రశ్నించారు.అసెంబ్లీ ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అని, వ్యక్తిగత దూషణలు, అనుచిత ప్రవర్తనకు వేదికగా మారకూడదని నేతలు స్పష్టం చేశారు.
