గుర్తుంచుకో రేవంత్.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్‎పై హరీష్ రావు రియాక్షన్

గుర్తుంచుకో రేవంత్.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్‎పై హరీష్ రావు రియాక్షన్

హైదరాబాద్: సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని కేటీఆర్, హరీష్ రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‎పై సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ఇది BRS సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్. ప్రజలు మా సమస్య గురించి మాట్లాడండి అంటుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం BRSని బయటకు పంపండి అంటున్నడు. నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం గుర్తుంచుకో రేవంత్ రెడ్డి’’ అని హరీష్ రావు పేర్కొన్నారు. 

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి.

హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు.

ALSO READ : శాసన మండలి నుంచి BRS సభ్యులు వాకౌట్

శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు. 

సమావేశాలకు అడ్డుపడుతోన్న బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ తీర్మానాన్ని ఆమోదించి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.