నాకే బ్యాంకులు రూ.6వేల 723 కోట్లు వడ్డీ కట్టాలి.. లెక్కలు బయటపెట్టిన విజయ్ మాల్యా!

నాకే బ్యాంకులు రూ.6వేల 723 కోట్లు వడ్డీ కట్టాలి.. లెక్కలు బయటపెట్టిన విజయ్ మాల్యా!

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తను భారత్‌కు రావాలని కోరుకుంటున్నప్పటికీ.. కొనసాగుతున్న చట్టపరమైన ప్రక్రియల కారణంగా తాను బ్రిటన్ వీడి వెళ్లలేనని స్పష్టం చేశారు. తాను 1992 నుంచి యూకేలో శాశ్వత నివాసిగా ఉంటున్నానని, భారత్‌కు ప్రయాణించకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని ఎక్స్‌ వేదికగా తెలిపారు. తనను పదేపదే పరారీలో ఉన్న వ్యక్తి అని, మోసగాడని ముద్ర వేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తన విషయంలో అత్యంత అన్యాయంగా వ్యవహరించిందని, కేవలం ప్రచారం కోసం తనను టార్గెట్ చేసినట్లు విజయ్ మాల్యా ఆరోపించారు.

తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన మాల్యా.. తాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి అసలు కారణం ED చర్యలేనని వెల్లడించారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు తన నిధులను ఉపయోగించాలని భావించినప్పటికీ.. ఈడీ తన ఆస్తులను, డబ్బును జప్తు చేయడం వల్లే అది సాధ్యం కాలేదని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈడీనే స్వయంగా తన జప్తు చేసిన నిధుల నుంచి సుమారు రూ.350 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు చెల్లించిందని గుర్తుచేశారు. 

అప్పుల కంటే ఎక్కువే రికవరీ.. 
విజయ్ మాల్యా కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం ఏంటంటే చెల్లించాల్సిన లోన్ కంటే ఎక్కువ రికవరీ. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. 2021 నాటికే తన నుంచి ఏకంగా రూ.14వేల 131కోట్ల 60 లక్షలు రికవరీ చేసినట్లు డాక్యుమెంట్లను ట్విట్టర్ ఖాతాలో ప్రజల ముందు పెట్టారు. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు అసలు రుణం కంటే మించి భారీగా రికవరీ చేసినప్పటికీ.. ఇప్పటికీ తనను బ్యాంకులను మోసం చేసిన మోసగాడిగా ప్రచారం జరగటాన్ని మాల్యా తప్పుపట్టారు. 

ALSO READ : రీజనల్ రూరల్ బ్యాంక్స్ విలీనం తప్పుడు నిర్ణయం: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి. రంగరాజన్

చట్టపరమైన లెక్కల ప్రకారం.. తాను చెల్లించాల్సిన అప్పు కంటే రికవరీ అయిన సొమ్ము ఎక్కువేనని, కొన్ని సందర్భాల్లో బ్యాంకు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు సంస్థల లెక్కల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ వివాదం ఇంకా కొనసాగుతోందని మాల్యా వాదిస్తున్నారు. తన దగ్గర 11.5 శాతం వడ్డీ లెక్కన వసూలు చేయిన మెుత్తం రూ.14వేల 131 కోట్లు పోగా అదనంగా రికవరీ అయిన రూ.3వేల 901 కోట్లపై కోర్టు ఆదేశాల తర్వాత అంటే 2021 ఆగస్టు 2 నుంచి ఇప్పటి వరకూ రూ.6వేల 723 కోట్లు తనకే వడ్డీ రావాల్సి ఉందని లెక్కలతో సహా బయటపెట్టారు.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణ వివాదమే మాల్యాపై కేసులకు మూలకారణం. 2012లో ఎయిర్‌లైన్స్ మూతపడిన తర్వాత నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్, విదేశాలకు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. 2016 మార్చిలో ఆయన యూకేకు వెళ్లగా, 2018 ఫ్యుజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ యాక్ట్ కింద ఆయనను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. తాను చట్టానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, న్యాయపోరాటం ద్వారా తనపై ఉన్న నిరాధార ఆరోపణలన్నింటినీ తొలగించుకుంటానని మాల్యా ధీమా వ్యక్తం చేస్తున్నారు.