Shreyas Iyer: భారత పురుషుల క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్‌తో ఆడనున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. గాయం లేదా ఫిట్నెస్ లోపం కాదంయో బాబు.. జాతీయ క్రీడల బాధ్యతల దృష్ట్యా బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆసియా గేమ్స్ సమయంలోనే విండీస్ తో భారత్ వన్డే సిరీస్ ఆడటంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఒకే రోజు రెండు దేశాల్లో భారత్ మ్యాచ్‌లు:
సెప్టెంబర్ చివర్లో ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత్ నేరుగా సెప్టెంబర్ 28వ తేదీన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న ఫైనల్స్ (మెడల్ రౌండ్) జరగనున్నాయి. సరిగ్గా అదే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్లాన్ చేశారు. ఆసియా గేమ్స్ పతక పోరులో శ్రేయస్ అయ్యర్ బిజీగా ఉండటంతో విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతను దూరంగా ఉండక తప్పడం లేదు.
జాతీయ జట్టు నాయకత్వం వహిస్తున్న అయ్యర్:
అక్టోబర్ 2025లో భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్ అయ్యర్, ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో టీమిండియాను గోల్డ్ మెడల్ దిశగా నడిపించే బాధ్యతను స్వీకరించాడు. ఆసియా గేమ్స్‌కు ముందు సెప్టెంబర్ 22న జపాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో కూడా అయ్యర్ సారథ్యంలోనే ఇండియన్ టీమ్ బరిలోకి దిగుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ ఆసియా గేమ్స్ పతకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో అయ్యర్‌ను ఆసియా గేమ్స్ జట్టుకే కెప్టెన్‌గా ఫిక్స్ చేసింది.
ఆసియా గేమ్స్‌లో బలమైన స్క్వాడ్‌తో ఇండియా వేట:
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జపాన్ వెళ్తున్న టీమిండియా ఆసియా గేమ్స్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్ లాంటి కీలక ఆటగాళ్ళు ఉన్నారు. విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు భారత్ ప్రత్యామ్నాయ సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును బరిలోకి దింపనుంది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడమే ధ్యేయంగా శ్రేయస్ సేన సమరానికి సమాయత్తం అవుతోంది.
