దొంగ భక్తులు.. వినాయక చవితికి విగ్రహం దొంగతనం చేయడమేంట్రా..?

దొంగ భక్తులు.. వినాయక చవితికి విగ్రహం దొంగతనం చేయడమేంట్రా..?

సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో ఇప్పటికే ఊరూరా విగ్రహాలు మండపాలకు చేరాయి. అయితే.. ఈ ఘటన మాత్రం విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడినే ఒకింత విస్మయానికి గురిచేసింది. విగ్రహ ఏర్పాటుకు స్థోమత లేకపోతే స్థానికంగా ఏర్పాటు చేసిన విగ్రహం దగ్గరకు వెళ్లొచ్చు. పూజలు చేయొచ్చు.

భజనలు చేయొచ్చు. కానీ.. ఈ కుర్రాళ్లు ఏకంగా వినాయక చవితికి తమ వీధిలో విగ్రహం పెట్టేందుకు వినాయకుడి విగ్రహాన్నే దొంగిలించారు. బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ కుర్రాళ్ల నిర్వాకం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. మాగడి రోడ్డులోని దాసరహళ్లిలో తెల్లవారుజామున సుమారు 3:51 గంటలకు ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వస్తూపోతుండే వాళ్లనే గమనించారు గానీ సీసీటీవీ కెమెరాలను గమనించలేదు. రోడ్డు పక్కన అమ్మకానికి ఉంచి పైన ఒక పట్ట కప్పిన విగ్రహాల్లో ఒక వినాయక విగ్రహం దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. టాటా ఏస్ గూడ్స్ వాహనంలో నలుగురు కుర్రాళ్లు స్పాట్కు చేరుకున్నారు.

బైక్స్ తిరుగుతుండటంతో కాసేపు అటూఇటూ తచ్చాడారు. ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత విగ్రహాల దగ్గరకు వెళ్లి.. పట్టను పైకి ఎత్తి.. విగ్రహాన్ని దొంగతనం చేశారు. వాహనంలోకి ఎక్కించి, ఆ ప్రాంతం నుంచి పారిపోవడం కనిపిస్తుంది. ఈ ఘటన మగడి రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయినా.. ఈ కుర్రాళ్ల పిచ్చితనం కాకపోతే దొంగిలించిన విగ్రహం తీసుకొచ్చి.. విగ్రహాలను తయారుచేయడమే బతుకుదెరువుగా మార్చుకున్న కష్ట జీవి పొట్టగొట్టి పూజలు చేస్తే వినాయకుడు మాత్రం ఎందుకు మెచ్చుతాడని ఈ వీడియో చూసిన నెటిజన్లు వాపోతున్నారు.