తెలంగాణ బియ్యం ఎగుమతులను పెంచండి..ఫిలిప్పీన్స్ అగ్రికల్చర్ సెక్రటరీతో మంత్రి ఉత్తమ్ భేటీ

తెలంగాణ బియ్యం ఎగుమతులను పెంచండి..ఫిలిప్పీన్స్ అగ్రికల్చర్ సెక్రటరీతో మంత్రి ఉత్తమ్ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచాలని ఫిలిప్పీన్స్  ప్రభుత్వాన్ని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్  అగ్రికల్చర్  సెక్రటరీ, ఆ దేశ క్యాబినెట్  సభ్యులు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్  జూనియర్‌‌ తో ఉత్తమ్  సమావేశమయ్యారు. భారత్–ఫిలిప్పీన్స్  సంబంధాలు, ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌‌కు ప్రత్యక్ష వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపై చర్చించారు. ధరలు, నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక భాగస్వామిగా నిలుస్తుందని ఉత్తమ్  స్పష్టం చేశారు. భారత్ లో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటిగా ఉద్భవించిందని వివరించారు.

నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్  మిల్లింగ్  వ్యవస్థ, అవసరమైన అనుభవం తెలంగాణకు ఉన్నాయని లారెల్  దృష్టికి తీసుకెళ్లారు. బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానాలు, రవాణా, ధ్రువీకరణ ప్రక్రియలు, శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలను సంబంధిత అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు పరిశీలించి, వాణిజ్య అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్ర విజ్ఞప్తిపై లారెల్  సానుకూలంగా స్పందించారు. 

‘తెలంగాణ రైజింగ్–2026’ కు రండి..

2026 డిసెంబర్‌‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్  సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు హైదరాబాద్  రావాల్సిందిగా లారెల్‌‌కు ఉత్తమ్  ప్రత్యేక ఆహ్వానం అందించారు. అలాగే ఇరువురు తమ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా పరస్పరం ఆహ్వానించుకున్నారు. కాగా, తెలంగాణ నుంచి మాంసం ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా లారెల్  ఆసక్తి చూపారు. దీనిని స్వాగతించిన ఉత్తమ్  విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధరంగాల్లో తెలంగాణకు సామర్థ్యం ఉందన్నారు. ఎగుమతికి అనువైన ఉత్పత్తులు, నాణ్యతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర నిబంధనలకు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.