మోడీ హాజరయ్యే సమిట్‌‌‌‌లో భద్రతా వైఫల్యం.. తుపాకీతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

మోడీ హాజరయ్యే సమిట్‌‌‌‌లో భద్రతా వైఫల్యం.. తుపాకీతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో పాల్గొనాల్సిన కార్యక్రమంలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. ఆ కార్యక్రమం జరగడానికి కొన్ని గంటలకు ముందే వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడిని తనిఖీ చేయగా ఫేక్ పీఎంఓ ఐడెంటిటీ కార్డు, అతడి అనుచరుడి వద్ద ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరని విచారిస్తున్నారు. 

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌‌‌‌‌‌‌‌’ (ఎన్‌‌‌‌ఏంఏసీసీ)లో గ్లోబల్ ఫిన్‌‌‌‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌‌‌‌ఎఫ్)–2026 సమిట్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం  రాత్రి భద్రతా ప్రొటోకాల్‌‌‌‌ డ్రిల్‌‌‌‌ను నిర్వహించారు.

 ఆ సమయంలో అక్కడ అనుమానాస్పద రీతిలో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని ప్రశ్నించగా రోహన్ పరేఖ్ (24) అనే వ్యక్తి వద్ద ఫేక్ పీఎంఓ ఐడీ కార్డు, అతడి అనుచరుడి వద్ద తుపాకీ లభించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీ, ఫేక్ ఐడీ కార్డులతో ప్రవేశించడానికి గల అసలు ఉద్దేశం ఏమిటనే కోణంలో ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు.