లా మేకర్స్.. బ్రేకర్స్గా మారిన్రు ! అసెంబ్లీ ముందు హరీశ్ చొక్కా విప్పడం అభ్యంతరకరం

లా మేకర్స్.. బ్రేకర్స్గా మారిన్రు ! అసెంబ్లీ ముందు హరీశ్ చొక్కా విప్పడం అభ్యంతరకరం
  • ఒకప్పుడు సభ హుందాగా జరిగేది.. ఇప్పుడా పరిస్థితి లేదు
  • బూతులు మాట్లాడటమే గొప్ప అన్నట్టుగా ఫీలవుతున్నారు
  • మీడియా కూడా బూతులు తిట్టే వారినే హైలెట్ చేస్తోంది
  • అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో లా మేకర్స్గా వ్యవహరించాల్సిన కొందరు ఎమ్మెల్యేలు లా బ్రేకర్స్​గా మారి సభకు చెడ్డ పేరు తెస్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నిరసన వ్యక్తం చేసే క్రమంలో హరీశ్​రావు లాంటి సీనియర్​ ఎమ్మెల్యే చొక్కా విప్పడం సరికాదన్నారు. కుస్తీ పోటీలకు పోయినట్లుగా అతడి ప్రవర్తన ఉందన్నారు. ధర్మరాజు లాంటి ధర్మం తెలిసిన వ్యక్తి అయిన స్పీకర్​ గడ్డం ప్రసాద్​ను వ్యక్తిగతంగా దూషించడం, ఆయన అసెంబ్లీలో కన్నీరు పెట్టుకోవడం తనను ఎంతగానో బాధించిందన్నారు.

ఇంట్లో ఉండే అమ్మ, అక్కా చెల్లెళ్లను తిట్టే హక్కు ఎవరిచ్చారని కూనంనేని ప్రశ్నించారు. గతంలో ఈ కల్చర్​ లేదని చెప్పారు. ఒకప్పుడు సభ చాలా హుందాగా జరిగేదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి సభలో ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా దూషించడం మొదలైందన్నారు.

కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్సీ తాత మధును స్పీకర్​ దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పించి ఉంటే బాగుండేదన్నారు. కేసీఆర్​ హుందాతనం పెరిగేదన్నారు. అంతేకానీ ‘భావిస్తే’ అనే పదంతో క్షమాపణ కోరడం సరికాదన్నారు. ఈ తిట్టుకునే జాడ్యం మనకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిందని, దీనికి పుల్​స్టాప్​ పడాల్సిందేనని అన్నారు.

భూతుల మాట్లాడటమే గొప్ప అన్నట్టు ఫీలవుతున్నారని, పొట్టొడు.. పొడుగోడు అంటూ అసెంబ్లీలో మాట్లాడటం సభ్యత అనిపించుకోదని తెలిపారు. మీడియా కూడా ఇలాంటి వారినే హైలెట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ కమిటీ వెంటనే దీనికి పుల్​స్టాప్ పెట్టాలని, భవిష్యత్​లో అసెంబ్లీ బయట, లోపల సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా దూషించకుండా గట్టి చర్యలు తీసుకునేలా సిఫారసు చేయాలని ఆయన కోరారు.