పోలీసులు తప్పు చేయలేదు చర్యల ఆదేశాలను రద్దు చేయండి..హైకోర్టులో సర్కారు మధ్యంతర వెకేట్‌‌ పిటిషన్ 

పోలీసులు తప్పు చేయలేదు చర్యల ఆదేశాలను రద్దు చేయండి..హైకోర్టులో సర్కారు మధ్యంతర వెకేట్‌‌ పిటిషన్ 
  • నిషేధాజ్ఞలను బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు 
  • స్పీకర్‌‌ ఆదేశాల మేరకే మార్షల్స్‌‌ పోలీసుల సాయం కోరారు 
  • పోలీసులకూ గాయాలయ్యాయి
  • పూర్తి వీడియో పరిశీలించాలన్న ఏజీ సుదర్శన్ రెడ్డి 
  • ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర లంచ్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేసింది. మధ్యంతర వెకేట్‌‌ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ టి.మాధవీదేవి మంగళవారం విచారణ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలను రాజకీయ కారణాలతో పోలీసులు అడ్డుకోలేదని, నల్ల దుస్తులు ధరించారనే చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, శాంతిభద్రతలకు భంగం కలిగించే సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలను నిషేధించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలున్న నల్ల టీ షర్టులను ధరించి వచ్చినందున స్పీకర్‌‌ ఆదేశాల మేరకు అడ్డుకోవడం జరిగిందన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు ఒకేసారి వచ్చారని ఏజీ వివరించారు. నల్ల టీషర్టులపై ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ నినాదాలు ముద్రించుకుని రావడం స్పీకర్‌‌ జారీ చేసిన బులిటెన్–34లోని నిబంధనలకు విరుద్ధమని వాదించారు. సభ్యులు నినాదాలు చేయడం, ప్లకార్డులు, కరపత్రాలు, సభా కార్యకలాపాలకు సంబంధం లేని ఇతర సాహిత్యాన్ని ప్రదర్శించడం నిషేధమని చెప్పారు.

టీషర్టుపై ముద్రించిన రాజకీయ నినాదం రూల్‌‌ 316 పరిధిలోకి వస్తుందన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాంతిభద్రతలను నిర్వహించే బాధ్యత చీఫ్‌‌ మార్షల్‌‌దేనని, అవసరమైనప్పుడు పోలీసుల సాయం తీసుకునే అధికారం ఆయనకు ఉందని ఏజీ తెలిపారు. చీఫ్‌‌ మార్షల్‌‌ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారని, స్పీకర్‌‌ ఆదేశాల మేరకే మార్షల్స్‌‌ పోలీసుల సహాయం కోరారని చెప్పారు. ఎమ్మెల్యేలను కావాలని అడ్డుకోవాలన్న ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. అక్కడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాత్రమే ప్రయత్నించారని తెలిపారు. మార్షల్స్‌‌ చెప్పినా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు ముందుకు తోసుకురావడంతో అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. 

ఎందుకు అడ్డుకున్నారు?

ఎమ్మెల్యేలను శాసనసభలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీషర్టులు ధరించడమే కారణమైతే మహిళా ఎమ్మెల్యేలు చీరల్లోనే వచ్చారు కదా.. వారిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించింది.

మహిళా ఎమ్మెల్యేల తలపట్టుకోవడం, మరొకరిని తోసివేయడం వంటి దృశ్యాలు ఫొటోల్లో కనిపిస్తున్నాయని పేర్కొంది. మహిళలను గౌరవించాల్సిన పరిస్థితుల్లో పోలీసులు అనుసరించిన తీరు సరికాదని వ్యాఖ్యానించింది. తెల్ల చొక్కా ధరించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారిని కూడా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంది. బీఆర్‌‌ఎస్‌‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌ తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ తరఫున సీనియర్‌‌ అడ్వొకేట్‌‌ గండ్ర మోహన్ రావు వాదిస్తూ.. శాసనసభలో ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలను అమలు చేసే అధికారం స్పీకర్‌‌కు మాత్రమే ఉందన్నారు.

ఆ అధికారాన్ని పోలీసులకు అప్పగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని, అది ‘పోలీస్‌‌ రాజ్‌‌’ అవుతుందన్నారు. నల్లటి టీషర్టులు ధరించకూడదని, నినాదాలు చేయకూడదని స్పీకర్‌‌ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. చీరల్లో వచ్చిన మహిళా ఎమ్మెల్యేలను, తెల్లచొక్కాతో ఉన్న మధుసూదనాచారిని కూడా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సభా నిబంధనలను ఉల్లంఘిస్తే స్పీకర్‌‌ చర్యలు తీసుకోవచ్చని, అవసరమైతే సస్పెండ్‌‌ లేదా బహిష్కరణ కూడా చేయవచ్చునని చెప్పారు.

పోలీసులు న్యాయనిర్ణేతలుగా మారి సభా నిబంధనలు అమలు చేయడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. పార్టీ తరఫున పిటిషన్‌‌ వేయలేదని, పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్‌‌ వేశారని వివరించారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని, వాటిని సవరించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందున తక్షణమే ఉత్తర్వుల జారీ అవసరం లేదని.. రికార్డులు, ఫొటోలు, వీడియోలు, నిబంధనలను పరిశీలించి తుది ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.   

పోలీసులపైనే దాడి

ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఏజీ స్పందిస్తూ.. ఘటనలో పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యేలు పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించేక్రమంలో తోపులాట జరిగిందన్నారు. పోలీసుల కాలర్‌‌ పట్టుకుని బెదిరించడంతో పాటు కొట్టారని, మహిళా పోలీసు సిబ్బందితో అనుచిత వ్యాఖ్యలు చేశారని వాదించారు. మహిళా పోలీసులే ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ఆరోపణలను ఖండిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి, ఎడిట్‌‌ చేయని వీడియోను పరిశీలించాలని హైకోర్టును కోరారు.

శాసనసభను ఎలా నిర్వహించాలి, సభ్యులు ఎలాంటి క్రమశిక్షణ పాటించాలన్నది స్పీకర్‌‌ పరిధిలోని అంశమని ఏజీ పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రివిలేజెస్, శాసనసభ, పార్లమెంట్‌‌ వ్యవహారాల్లో స్పీకర్‌‌ నిర్ణయాధికారానికి సుప్రీంకోర్టు ప్రాధాన్యమిచ్చిన తీర్పులను ప్రస్తావించారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లోని చివరి రెండు పేరాలను తొలగించాలని, పోలీసులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలన్న ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. వ్యక్తి ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణాలతో బీఆర్‌‌ఎస్‌‌ రాజకీయ పార్టీ పిటిషన్‌‌ దాఖలు చేయడం చెల్లదని, దానికి విచారణార్హత లేదన్నారు.