లక్సెట్టిపేట వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయామని.. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ భూములను కోల్పోతే తాము ఎలా బతికేది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులు మంగళవారం లక్సెట్టిపేటలోని విశ్రాంతిభవనం ఆవరణలో మాట్లాడారు.
గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే కోర్టును ఆశ్రయించామని, కేసు కోర్టులో ఉండగానే అధికారులు నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. రైతు నాయకులు శ్రీనివాస్ గౌడ్, తులా మధుసూదన్ నారపరెడ్డి, పాదం శ్రీనివాస్, మహేశ్,చంద్రమౌళి పాల్గొన్నారు.
