- రూ.6 కోట్ల నిధులతో ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి
- గిరిజనుల నాగరికతను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు
- నెల రోజుల్లో పర్యాటకంగా అందుబాటులోకి రానున్న కోట
ఆదిలాబాద్, వెలుగు: నాడు గోండు రాజుల పాలనలో ఆదిలాబాద్‌లోని కోటలు, బురుజులు ఓ వెలుగు వెలిగాయి. గోండుల సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. అందులో ఒకటి ఉట్నూరు మండల కేంద్రంలో ఉన్న 13వ శతాబ్దంలోని చారిత్రక గోండు రాజుల కోట. ఎన్నో ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ కోటకు పునర్ వైభవం రానుంది.
కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. అధునాతన హంగులతో సరికొత్త ఎకో టూరిజం కేంద్రంగా తీర్చుదిద్దుతోంది. చారిత్రక ప్రాధాన్యత, గిరిజన సంప్రదాయాల సమ్మేళనంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఇదీ చరిత్ర..
రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో గోండు రాజుల పాలనకు ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కేంద్రంగా 9 శతాబ్దాల పాటు గోండు రాజులు పాలన సాగించారు. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోని పలు ప్రాతాల్లో రాజ్యం విస్తరించి ఉండేది. వారి పాలనలో ఎన్నో కోటలు, బురుజులను నిర్మించారు.
అందులో ఒకటి 1309లో ఉట్నూర్‌లోని కేబీ కాంప్రెక్స్ సమీపంలో నిర్మించిన గోండు రాజు కోట. దీన్ని రాతి, సున్నంతో నిర్మించారు. కోట చుట్టూ లోతైన కందకాలు, స్నానం చేయటానికి, దుస్తులు మార్చుకోవడానికి రాతి గదులు ఉన్నాయి. 1800లో బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యే వరకు కూడా ఇక్కడ గోండు రాజుల పాలన సాగింది. ఏటా దసరా రోజు ఇక్కడ ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేస్తారు.
గోండు రాజుల వైభవం ప్రతిబింబించేలా..
15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉట్నూర్ గోండు రాజుల కోట గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉట్నూర్ గోండు రాజుల కోటను పునరుద్ధరిస్తోంది.
రూ.6 కోట్ల నిధులతో పనులు చేపడుతూ గిరిజనుల నాగరికత, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా కోటను ముస్తాబు చేస్తోంది. మరో నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. గోండు రాజుల చరిత్రను వివరించే సమాచార కేంద్రం, గిరిజన సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శన కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
గోపురాలు, గోడలు, కోనేరు, మెట్లకు మెరుగులు దిద్దుతున్నారు. బురుజులు, మెట్ల బావిని పునరుద్ధరిస్తున్నారు. గోడలను పటిష్టం చేస్తున్నారు. ఒక మ్యూజియం, కట్టల సుందరీకరణ, ఓపెన్ థియేటర్, చిల్ర్డన్స్ పార్క్, వేదిక, రాణి మహాల్, ఫిరంగులు, సొరంగం మార్గం, పాదచారుల మార్గం, ఫౌంటెయిన్, సౌర దీపాలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పర్యాటక రంగ అభివృద్ధితో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
గోండు రాజుల చారిత్రాత్మక కోటను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నాం. గిరిజన వారసత్వాన్ని పరిరక్షిస్తూ, ఆధునిక పర్యాటక సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. గిరిజనుల చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఐటీడీఏ కృషి చేస్తోంది.
మంద కమరందు, పీవో, ఐటీడీఏ, ఉట్నూర్
