పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లిండు..వాహనాలను ఆపి డబ్బులు వసూలు..పట్టుకున్న కరీంనగర్ పోలీసులు

పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లిండు..వాహనాలను ఆపి డబ్బులు వసూలు..పట్టుకున్న కరీంనగర్ పోలీసులు

కరీంనగర్ క్రైం, వెలుగు : ఓ వ్యక్తి దర్జాగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి పోలీసులకు చెందిన వాహనాన్నే దొంగిలించాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బొమ్మకల్ గ్రామానికి చెందిన ఎండీ. అజాజ్ మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ పోలీస్ వెహికల్ లో తాళం చెవి ఉండడాన్ని గమనించి ఆ వాహనాన్ని తీసుకొని పారిపోయాడు. 

కొద్దిసేపటి తర్వాత గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి హనుమకొండ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనాన్ని తీసుకెళ్లిన అజాజ్.. మార్గమధ్యలో వైర్ లెస్ సెట్ పడేశాడు. 

హనుమకొండ సమీపంలో ఓ డివైడర్ ను ఢీకొట్టాడు. అనంతరం అందులో ఉన్న పోలీస్ క్యాప్, లాఠీ సాయంతో రోడ్డుపై వెళ్లే వాహననదారులను ఆపి వసూళ్లకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హనుమకొండ పోలీసులు అక్కడికి వచ్చి అజాజ్ ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ పోలీసులకు అప్పగించారు.