బిహార్ లో జరిగిన ఓ మీటింగ్ లో ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ సభలో ప్రధానిమోదీ బాప్ అంటూ ఖర్గే వ్యాఖ్యానించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతుండగా.. ఖర్గే వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధించింది. ఖర్గే ఓ వ్యక్తి అడ్డుకోవడం వల్లే అలా మాట్లాడారని వివరణ ఇచ్చింది.
ఆదివారం (అక్టోబర్25) పాట్నాలో జరిగిన బీహార్ మొదటి సీఎం శ్రీ కృష్ణ సింగ్ 139వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతుండగా.. ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి మోదీ కహిన్ నహీన్ జాయేగా (మోడీ ఎక్కడికీ వెళ్లడు) అని కేకలు వేశారు. అప్పుడు ఖర్గే, మోదీ కా బాప్ భీ జాయేగా బాప్ భీ జాయేగా (అతని తండ్రి కూడా వెళ్తారు) అని సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని, ఆయన కుటుంబంపై కాంగ్రెస్ పదేపదే దూషణలు చేస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. పాట్నాలో మోదీజీ తండ్రి గురించి అసభ్యకరమైన వ్యాఖ్య చేయడం ద్వారా ఖర్గే మర్యాద నియమాలను ఉల్లంఘించారు అని షా అన్నారు.
మోదీ, ఆయన కుటుంబంపై కాంగ్రెస్ నేతలు దూషించడం ఇది మొదటి సారి కాదు.. కొన్ని సార్లు మోదీ తల్లిగారిని అవమానించారు. మోదీని మృత్యువ్యాపారి అన్నారు. చాయ్ వాలా అని పేదరికాన్ని హేళన చేశారని X లో అమిత్ షా ఓ పోస్ట్ ను షేర్ చేశారురాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ హద్దులు దాటుతూనే ఉందని షా అన్నారు.
అయితే బీజేపీ ఆరోపణలు కాంగ్రెస్ ఖండించింది. బీజేపీనే కాంగ్రెస్ నేతలను పదే పదే అవమానిస్తోందని.. ఉత్తరాఖండ్ హల్ద్వానీ ఘటనను కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా గుర్తు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నేతలు పదే పదే అవమానిస్తూ వస్తున్నారని విమర్శించారు. ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకోవడం వల్లే అలా మాట్లాడారని సమర్ధించారు.
