శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాల పేరుతో మోసం..ఫేక్ అపాయింట్ లెటర్ ఇచ్చిన నిందితుడు

శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాల పేరుతో మోసం..ఫేక్ అపాయింట్ లెటర్ ఇచ్చిన నిందితుడు
  • 21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు

కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి వెల్లడించారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లికి చెందిన దూడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావు తాను కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నట్లు పలువురిని నమ్మించాడు. 

ఈ క్రమంలో కరీంనగర్ విద్యానగర్ కు చెందిన పురుషోత్తం, మమత పరిచయం కాగా.. మమత కుమార్తె కీర్తనకు యూనివర్సిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు-డిమాండ్ చేశాడు. 

దీంతో మమత రూ.65 వేలు చెల్లించగా, మిగిలిన రూ.85 వేలను తిరుపతి భార్య దూడపాక లావణ్య అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అనంతరం కీర్తన రికార్డ్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికైనట్లు నకిలీ నియామక ఉత్తర్వు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మమత బంధువులు సైతం తిరుపతిని సంప్రదించగా, వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. 

ఇతడికి నర్సింహమూర్తి, పోల వెంకటేశ్వర్ రావు, ఈట్ల సత్యం సహకరించారు. మమత తనకు ఇచ్చిన ఆర్డర్ తో యూనివర్సిటీకి వెళ్లగా.. ఆ లెటర్ నకిలీదని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు తిరుపతిని అరెస్ట్ చేశారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు సుమారు 21 మంది నుంచి మొత్తం రూ.44 లక్షలు వసూలు చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.