రాష్ట్రాల్లో ఆయుష్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం..కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ జాతీయ వర్క్‌‌‌‌షాప్

రాష్ట్రాల్లో ఆయుష్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం..కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ జాతీయ వర్క్‌‌‌‌షాప్
  • హాజరైన కేంద్ర మంత్రి ప్రతాప్‌‌‌‌రావు జాదవ్, నీతి ఆయోగ్ సభ్యులు
  • ఆయుష్ గ్రిడ్, వెల్ నెస్ టూరిజం విస్తరణపై అధికారుల మేధోమథనం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంప్రదాయ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నేషనల్ వర్క్‌‌‌‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనం వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌‌‌‌ రావు గణపత్‌‌‌‌ రావ్ జాదవ్ తో పాటు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం. శ్రీనివాస్‌‌‌‌, వివిధ రాష్ట్రాల ఆయుష్ శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు, వైద్య నిపుణులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రతాప్ రావ్ జాదవ్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో సంప్రదాయ వైద్యం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి పద్ధతులను ఆధునిక వైద్యంతో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ ఆయుష్ సేవలను చేరువ చేసేందుకు సమగ్ర విధానాలు రూపొందిస్తున్నామన్నారు. 

ఆయుష్ అభివృద్ధిపై చర్చ

ప్రతి రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రోడ్‌‌‌‌ మ్యాప్ రూపొందించడంపై వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌ లో చర్చించారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద ఆస్పత్రులు, హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల మౌలిక సదుపాయాలను మరింత పెంచాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను డిజిటల్ ప్లాట్‌‌‌‌ ఫాంపైకి తెచ్చేందుకు రూపొందించిన ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రాల్లో వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. 

ఆయుర్వేద, హోమియో, యునానీ మందుల నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడంపై అధికారులు చర్చించారు. సంప్రదాయ చికిత్సల కోసం విదేశాల నుంచి వచ్చే వారిని ఆకర్షించేలా రాష్ట్రాల్లో మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఆయుష్ వెల్ నెస్ పర్యాటకం)ను విస్తరించాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను (బెస్ట్ ప్రాక్టీసెస్) సమావేశంలో పంచుకున్న అధికారులు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.