ఈ వారం ప్రారంభం నుంచి భారత స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లపై బేర్స్ బలాన్ని కలిగి ఉండటమే దీనికి కారమంగా నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ, ట్రంప్ టారిఫ్స్ సహా మరిన్ని అంశాలు కీలకంగా ఉన్నాయి. ఉదయం 10.12 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 153 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 291 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 408 పాయింట్ల నష్టంతో తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు:
క్రూడ్ ఆయిల్ ధరల పరుగులు:
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఏకంగా 1.5 శాతం ఎగబాకి బ్యారెల్ ధర 99.5 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడం భారత్ లాంటి దేశాలకు పెద్ద ఆందోళనకర విషయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచడంతో పాటు, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని మరింత రెచ్చగొట్టి, ఆర్థిక వృద్ధి వేగాన్ని మందగింపజేస్తుందని అంచనా వేస్తున్నారు.
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్:
పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పలు ప్రధాన నగరాలపై దాడులు జరిపారు. అమెరికాకు మిత్రదేశంగా ఉన్న సౌదీపై ఈ దాడి జరగడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు అమెరికా బలగాలు జరిపిన మెరుపు దాడుల్లో పలు ఇరాన్ చమురు ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడులకు పాల్పడటంతో అంతర్జాతీయంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
ఫారెన్ ఇన్వెస్టర్ల ప్రభావం:
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల మంటలు తోడవటంతో భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఫారెన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకడుగు వేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారారు. ఒక్క రోజే వారు మార్కెట్ నుంచి రూ. 123 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను వెనక్కి తీసుకుని, అమ్మకాలకు మొగ్గు చూపారు. గ్లోబల్ పరిణామాలు ఇలాగే కొనసాగితే మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
