హైదరాబాద్, వెలుగు: అప్పారెల్ గ్రూప్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ రిటైల్ సంస్థ కార్ఫోర్ భారతదేశంలోకి అడుగుపెట్టింది. నోయిడాలో హెచ్ అండ్ ఎస్ మాల్‌లో 50 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇక్కడ 15 వేలకుపైగా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా లభించే కూరగాయలు, కిరాణా సరుకులు, బేకరీ ఉత్పత్రులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పాటు అంతర్జాతీయ బ్రాండ్లు కూడా లభిస్తాయి.
సప్లై చైన్‌ను బలోపేతం చేయడానికి స్థానిక సరఫరాదారులతో కలిసి పనిచేస్తామని కంపెనీ తెలిపింది. భారత్ రిటైల్ మార్కెట్ 2030 నాటికి 2.36 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఓమ్నీ చానల్ విధానాన్ని అనుసరించనున్నట్లు కార్ఫోర్ ప్రకటించింది.
