అసెంబ్లీలో తీవ్ర విషాదం..స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు ఆకస్మిక మృతి

అసెంబ్లీలో తీవ్ర విషాదం..స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు ఆకస్మిక మృతి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజు ఉదయం అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలారు. గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. సీపీఆర్ చేసినప్పటికీ రాజు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వెంటనే అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడమే ఈ మృతికి కారణమని తెలుస్తోంది.

రాజు ఆకస్మిక మరణం అటు అసెంబ్లీలో ఉన్నవారితో పాటు సెక్రటేరియేట్ ఉద్యోగుల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆయన మృతిపై సంతాపం తెలిపింది. రాజుకు సౌమ్యుడిగా పేరుంది. ఎవరొచ్చినా ‘అయ్యా’ అంటూ పలకరిస్తూ ఓపికతో సమాధానం ఇస్తారనే పేరుంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉండగా, కుమారుడు ఐఐటీలో చదువుతుండగా, కుమార్తె ఇంటర్మీడియేట్ చేస్తోంది.