బోధన్, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు పార్టీల నాయకులు ఓకేసారి నిరసన తెలపడం, పరస్పరం తోసుకుంటూ గొడవ పడ్డారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అక్కడే కూర్చోని నిరసన తెలిపారు. ఇదే సమయంలో హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందంటూ నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాకు వచ్చారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకులు ఎదురెదురుగా కూర్చొని పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.
