న్యూఢిల్లీ: భారత్‌లో పాసివ్ స్మోకింగ్(సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) కారణంగా సంభవిస్తున్న మరణాలు 50 శాతం వరకూ పెరిగాయని ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయిన నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 1990లో పాసివ్ స్మోకింగ్ కారణంగా 2,17,700 మరణాలు సంభవించగా, 2023లో 3,25,600 డెత్స్ నమోదయ్యాయని తేలింది.
‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) 2023 సెకండ్- హ్యాండ్ స్మోక్ కొలాబొరేటర్స్’ అనే అంతర్జాతీయ పరిశోధకుల బృందం 204 దేశాలు, ప్రాంతాలలో పాసివ్ స్మోకింగ్‌కు గురవుతున్న వారి సంఖ్యను, దానివల్ల కలిగే వ్యాధి భారాన్ని అంచనా వేసింది. వీరి స్టడీ నివేదిక ఇటీవల ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.
భారత్‌లో సెకండ్ హ్యాండ్ స్మోక్ బారిన పడుతున్న జనాభా1990లో 37.5 కోట్లు ఉండగా, 2026 నాటికి 44.4 కోట్లకు (18.4 శాతం పెరుగుదల) చేరిందని రీసెర్చర్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2023లో 271 కోట్ల మంది ప్రజలు ఎస్‌హెచ్‌ఎస్ (సెకండ్ హ్యాండ్ స్మోక్) బారిన పడ్డారు. వీరిలో 0 నుంచి-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 767 మిలియన్ల (76.7 కోట్లు) మంది ఉన్నారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 శాతం మంది పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఈ స్టడీలో వెల్లడైంది.
మూడు దేశాల్లోనే సగం మంది బాధితులు..
ప్రపంచవ్యాప్తంగా 2023లో ఎక్స్‌పోజర్ వ్యాప్తి 33.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఈ పొగ ప్రభావానికి గురవుతున్న జనాభాలో సగంమంది చైనా, భారత్, ఇండోనేషియా దేశాల్లోనే ఉన్నారు. 2023లో ఈ మూడు దేశాల్లో వరుసగా 66.4 కోట్లు, 44.4 కోట్లు, 14.2 కోట్ల మంది ప్రజలు దీని బారిన పడ్డారని రీసెర్చర్లు అంచనా వేశారు.
కొన్ని దేశాల్లో పురుషుల కంటే మహిళలు దాదాపు 1.8 రెట్లు ఎక్కువ ఎక్స్‌పోజర్ వ్యాప్తిని ఎదుర్కొంటున్నారని గుర్తించారు. కాగా, మరణాల రేటు (ప్రతి లక్ష మంది జనాభాకు సంభవించే మరణాలు) మాత్రం1990లో 46.1శాతంగా ఉండగా, 2023 నాటికి 30 శాతానికి తగ్గాయని రీసెర్చర్లు అంచనా వేశారు.
