ఇరాన్‌‌‌‌పై యుద్ధంలో అమెరికా గెలిచాక చమురు ధరలు దిగొస్తయ్: ట్రంప్

ఇరాన్‌‌‌‌పై యుద్ధంలో అమెరికా గెలిచాక చమురు ధరలు దిగొస్తయ్: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌పై కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిన వెంటనే చమురు ధరలు భారీగా తగ్గుతాయని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గ్యాలన్ గ్యాస్ ధర రెండు డాలర్ల కంటే తక్కువకు పడిపోతుందని జోస్యం చెప్పారు. సోమవారం(స్థానిక కాలమానం ప్రకారం) తన ట్రూత్ సోషల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో ట్రంప్ ఈ మేరకు పోస్టు పెట్టారు. ప్రస్తుతం చమురు ధరలు అధికంగా ఉండటానికి పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే మార్కెట్లు వేగంగా స్థిరపడతాయని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘ఇరాన్‌‌‌‌తో యుద్ధంలో మనం గెలిచినప్పుడు, చమురు ధరలు మిగతా అన్నింటిలాగే (మరింత వేగంగా) దారుణంగా పడిపోతాయి” అని ట్రంప్ రాశారు. ఇరాన్‌‌‌‌ను అణు ఆయుధం కలిగి ఉండనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు. అంతకుముందు, ఇరాన్ ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకునే ఎలాంటి దుస్సాహసానికైనా పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ ‘ఎక్స్‌‌‌‌’లో తీవ్రంగా హెచ్చరించారు.

 ‘‘ఇరాన్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు ప్రమాదం పొంచి ఉంది. హార్మూజ్ ప్రాంతంలో అమెరికన్ చమురు, గ్యాస్ కంపెనీలు కూడా అదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మా ఆస్తులపై దాడి చేయండి, అప్పుడు మీకు కూడా దెబ్బ తగులుతుంది. మేం ఇప్పటికే నిరూపించాం’’ అని ఆయన పేర్కొన్నారు.