నాలుగేండ్ల కూతురితో కలిసి మహిళ ప్రాణాలు తీసుకుంది.. నిజామబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఘటన

నాలుగేండ్ల కూతురితో కలిసి మహిళ ప్రాణాలు తీసుకుంది.. నిజామబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఘటన
  • కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు
  • నిజామబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఘటన

ఎడపల్లి, వెలుగు : ఓ మహిళ తన నాలుగేండ్ల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్​జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ పట్టణంలోని అస్మీ కాలనీకి చెందిన ఇమ్రానా బేగం (32) భర్త ఆసిఫ్ కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటున్నాడు. 

దీంతో ఇమ్రానా బేగం తన కూతురు నేహా అజ్లిన్ కలిసి అత్తగారింట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం కూతురితో కలిసి బయటకు వెళ్లిన ఇమ్రానా బేగం ఎంతకూ తిరిగి రాలేదు. ఫోన్ సైతం స్విచాఫ్ అని రావడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మంగళవారం సాయంత్రం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ చెరువులో తల్లీకూతురి డెడ్ బాడీలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్ బాడీలను బయటకు తీయించి.. చనిపోయింది ఇమ్రానా బేగం, ఆమె కూతురిగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే కూతురితో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్ బాబు తెలిపారు.