- రాష్ట్రంలోనే తొలిసారి..
- లోకల్ ట్యాలెంట్ ఫర్ గ్లోబల్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ తో పోర్టల్ రూపకల్పన
- జిల్లాలోని నిరుద్యోగులకు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో వందల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఏటా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం, టెక్నికల్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. కానీ ఏ కంపెనీలో సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు ఉన్నా వాటిని పొందలేకపోతున్నారు.
ఉద్యోగాల కోసం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అదే సమయంలో ఆయా కంపెనీలు వివిధ విభాగాల్లో తమకు అవసరమైన ఉద్యోగులను ఇతర ప్రాంతాల నుంచి ఎంపిక చేసుకొని ఇక్కడికి తరలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా నిరుద్యోగులకు, జిల్లాలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో తొలిసారిగా మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ప్రత్యేక చొరవతో మెదక్ ఎంప్లాయ్‌మెంట్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్(ఎంఈఎస్ఐసీ) పోర్టల్ రూపొందించారు.
ఒకే డిజిటల్ వేదిక
జిల్లా ఐటీ టీమ్, ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎంఈఎస్‌ఐసీ పోర్టల్.. జిల్లాలోని ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు, స్థానిక పరిశ్రమలను ఒకే వ్యవస్థపై అనుసంధానించడానికి వీలుగా జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ వేదిక. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఏటీసీ, ఐటీఐ, డిగ్రీ, జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఎంఈఎస్ఐసీ పోర్టల్రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్ గా ఉపయోగపడుతుంది.
బీటెక్, డిప్లొమో, ఐటీఐ, డిగ్రీ, ఇంటర్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు పోర్టల్‌లో పేరు నమోదుకు అవకాశం ఉంది. కాలేజీల ప్లేస్‌మెంట్ కో ఆర్డినేటర్లు, ఇండస్ట్రీ రిక్రూటర్లకు సైతం పోర్టల్‌లో లాగిన్అవకాశం ఉందని డిస్ట్రిక్ మేనేజర్సందీప్ తెలిపారు.
600కు పైగా కంపెనీలు పోర్టర్‌లో నమోదు
జిల్లా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా, పెద్ద అన్నీ కలిపి 742 కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కంపెనీల్లో ఎక్కువ ఐరన్, ఫార్మాసూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితరకంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో ఇప్పటివరకు 600కు పైగా ఎంఈఎస్ఐసీ పోర్టల్‌లో ఆన్‌బోర్డు అయ్యాయి.
మంత్రి వివేక్ చేతుల మీదుగా ప్రారంభం
జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని శాంతా బయోటిక్స్ పరిశ్రమలో ఎంఈఎస్ఐసీ పోర్టల్‌ను రాష్ట్ర ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గతనెల 17న ప్రారంభించారు.
నిరుద్యోగులు ఉపయోగించుకోవాలి
జిల్లాలో ఉన్నత విద్యా, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఏ పరిశ్రమలో ఉద్యోగం పొందాలో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్తున్నారు.
అలా కాకుండా జిల్లాలోని నిరుద్యోగ యువత వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా ఎంఈఎస్ఐసీ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చాం. నిరుద్యోగులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రతిమాసింగ్, మెదక్ కలెక్టర్-
