- ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం
ఓయూ, వెలుగు: యువత ఉద్యోగం కోరేలా కాకుండా ఉద్యోగాలను సృష్టించేలా ఎదగాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేశాన్ని బలోపేతం చేయడంలో పారిశ్రామిక ప్రగతి స్వాలంబన సమిష్టి కృషి కీలకమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ 85వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగోర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. గవర్నర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా చీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగరం కుమార్, రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి విద్యార్థులకు 640 పీహెచ్‌డీ పట్టాలు, 71 బంగారు పతకాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం తనను విశేషంగా ఆకట్టుకుందన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా మాట్లాడుతూ.. ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ధికి దోహద పడాలని పిలుపునిచ్చారు.
యువత విద్యార్హతలు సాధించడానికి పరిమితం కాకుండా, ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా సమాజ సమస్యలకు పరిష్కారాలను సృష్టించే వారిగా ఎదగాలని కోరారు. దేశంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు భూములు, నగలు సైతం అమ్మి త్యాగాలు చేస్తారని, విద్య జీవితాలను మార్చగల శక్తిగా విశ్వసించడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడారు.
