- ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు: అసెంబ్లీకి దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఉన్నందునే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. దళిత జాతి అంటే బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబానికి మొదటి నుంచి అసహ్యమని, అందుకే 2014 నుండి దళిత జాతిని కేసీఆర్ అవమానిస్తూ వస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేశారు.
కేసీఆర్ వెంటనే దళిత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ మొదటి నుంచి దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యమ సమయంలో తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని దళితులతో ఓట్లేయించుకున్న కేసీఆర్.. తానే సీఎం పీఠంపై కూర్చుని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత బిడ్డ ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అయిలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనంతరం దాదాపుగా వెయ్యి కార్లతో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ ముట్టడికి వెళ్లారు. వాసాలమర్రి సమీపంలో ఎమ్మెల్యేలు అయిలయ్య, వీరేశం, అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోగా.. మిగతా కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లారు.
