- పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగు, ఇతర ప్రాజెక్టుల కోసం ఏర్పాటు
- సహకరించని ప్రభుత్వ శాఖలు
- ఆదాయంలో ఒక్క శాతం ఇవ్వని డిపార్ట్మెంట్లు
- నిధుల కొరతతో హుమ్టాకు సమస్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పడిన ‘హైదరాబాద్ యునిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ’(హుమ్టా)ను నిధుల కొరత వేధిస్తోంది. దీనికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కొంచం కూడా సహకారం లభించడం లేదు. హుమ్టాను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అర్బన్ట్రాన్స్పోర్ట్ ఫండ్ ఏర్పాటు చేసింది.
ఈ ఫండ్‌ను పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా కేటాయించారు. దీని కోసం వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యులను చేస్తూ ప్రత్యేక కమిటీలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఆర్టీఏ, ఆర్టీసీ, మెట్రో రైల్వంటి సంస్థలున్నాయి.
అయితే, ఈ శాఖలకు వచ్చే ఆదాయం నుంచి కనీసం ఒక శాతం నిధులను అర్బన్ట్రాన్స్పోర్ట్ఫండ్కు అందజేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకూ ఏ శాఖ కూడా ఈ ఫండ్స్ఇవ్వడం లేదు. దీంతో హుమ్టా రూపొందిస్తున్న వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడుతున్నది.
ఇటీవల జరిగిన స్టేక్హోల్డర్స్మీటింగులో హుమ్టా తన పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వ శాఖల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల తాము రూపొందించే ప్లాన్లు సరిగ్గా అమలు చేయలేకపోతున్నామని వాపోయింది. దీంతో ప్రభుత్వం త్వరలోనే స్టేక్‌హోల్డర్స్(భాగస్వామ్య విభాగాలు)తో మరోసారి స్పెషల్మీటింగ్నిర్వహించనున్నది.
హుమ్టాకు నిధులు ఎందుకంటే..
మహా నగరాన్ని గ్లోబల్ సిటీగా ఆవిష్కరించేందుకు అవసరమైన ప్రాజెక్టులు చేపట్టేందుకు భారీగా నిధుల అవసరం ఉంటుంది. సిటీలో పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్ ను మెరుగుపరిచేందుకు హుమ్టా తాజాగా కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఎల్బీనగర్, దిల్‌సుక్‌నగర్, హైటెక్‌సిటీ, ఐకియా తదితర ఏరియాల్లో స్కైవాక్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది.
సిటీలోని ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల కింద ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు, వెండర్స్ జోన్ పేరుతో చిన్న చిన్న వ్యాపార సమూహాలను నిర్మించాలని ప్లాన్ చేసింది. 12 జోన్లలో పాదచారుల కోసం ప్రత్యేక్ ట్రాక్‌లను నిర్మించనున్నది. ఆయా ప్రాంతాల్లో వెండింగ్జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి వాటిలో ప్రయాణించే వారికి డిజిటల్ప్లాట్ఫామ్ల ద్వారా ఉమ్మడి మొబైల్యాప్ ఏర్పాటుకు కూడా హుమ్టా సన్నాహాలు చేస్తోంది. వీటికి కావాల్సిన నిధుల కొరతతో సమస్యగా మారింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఆర్టీఏ, ఆర్టీసీ, మెట్రో వంటి సంస్థలు పౌరసేవలపై పన్నులు వసూలు చేస్తున్నాయి. ఆ సంస్థలకు వచ్చే ఆదాయంలో కనీసం ఒక శాతం నిధులను హుమ్టాకు అందజేయాలని ప్రతిపాదించినా పట్టించుకోవడం లేదు.
