సింగరేణి పెన్షన్.. మందులకూ సాల్తలే .. కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం

సింగరేణి పెన్షన్.. మందులకూ సాల్తలే .. కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం
  • వేలాది మందికి రూ.200 నుంచి రూ.500 మధ్యే అందుతున్న పింఛన్
  • దయనీయంగా బతుకీడుస్తున్న రిటైర్డ్ కార్మికులు
  • మూడేండ్లకోసారి సవరించాల్సి ఉన్నా 28 ఏండ్లుగా రివైజ్డ్ కాని పెన్షన్
  • కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం
  • నేడు శ్రీరాంపూర్​లో  రిటైర్డు కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి రిటైర్డ్ కార్మికులు చాలీచాలని పెన్షన్ తో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వం వృద్ధులకు నెలకు రూ. 2 వేల చేయూత పెన్షన్ ఇస్తుంటే... మూడు, నాలుగు దశాబ్దాల పాటు బొగ్గు గనుల్లో పనిచేసిన కార్మికులకు మాత్రం రూ. 500లోపే అందుతోంది.

 ఈ డబ్బులు కనీస అవసరాలకు, మందుల ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో చాలా మంది కార్మికులు రిటైర్ మెంట్ తర్వాత కూడా కూలీలుగా, హోటల్​ వర్కర్లుగా, పండ్లు, కూరగాయల వ్యాపారులుగా పనిచేస్తున్నారు. 

ఒంట్లో ఓపిక లేని వారు భిక్షాటన చేస్తుండగా, మరికొందరు కుటుంబాలను పోషించలేక ఆత్మహత్య చేసుకున్నారు. కనీస పింఛన్ పెంచాలని రిటైర్ కార్మికులు 28 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 

కనీస పెన్షన్ ఇప్పటికీ రూ. 350

అత్యంత ప్రమాదకరమైన బొగ్గు గనుల్లో 35 నుంచి 40 ఏండ్ల పాటు పనిచేసిన రిటైర్డు ఎంప్లాయిస్​కు కనీస పెన్షన్ ఇప్పటికీ రూ.350 మాత్రమే ఉంది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 84,808 మంది పెన్షన్​పొందుతున్నారు. కోల్ ఇండియాతో కలుపుకుంటే మొత్తం రిటైర్డ్ కార్మికులు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. 

కోల్​మైన్స్​ప్రావిడెంట్​ఫండ్స్ స్కీం-1998లో అమల్లోకి తెచ్చారు. దీనిని మూడేండ్లకోసారి సవరించాలన్న రూల్ ఉంది. కానీ 28 ఏండ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా సవరించలేదు. స్కీం అమల్లోకి వచ్చే నాటికి బొగ్గు పరిశ్రమల్లో ఐదో వేజ్​బోర్డు అమలులో ఉంది. అప్పటి బేసిక్​ శాలరీ, డీఏ కలిసి పది నెలల్లో ఎంత అవుతుందో.. అందులో 25 శాతాన్ని పెన్షన్​గా నిర్ణయించారు. అదే మొత్తాన్ని నెలవారీగా అందజేస్తున్నారు. 

ఒక వేళ రిటైర్డ్ ఎంప్లాయ్ చనిపోయే భార్యకు 60 శాతం మొత్తాన్ని అందిస్తున్నారు. ఐదో వేజ్​బోర్డు కాలంలో బేసిక్ రూ. 1,700 ఉండగా.. నెల వేతనం రూ.2,138 లభించేది. అప్పటి ధరల ప్రకారం కనీస పెన్షన్​రూ.300 వచ్చినా సరిపోయేది. కానీ ప్రస్తుతం ధరలు అనేక రెట్లు పెరిగినా.. రిటైర్డు ఎంప్లాయిస్​పెన్షన్​మాత్రం పెరగలేదు.

 రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పెన్షన్ వస్తుండగా, డీఏ పెంపు జరిగిన ప్రతీసారి పింఛన్​లో సైతం పెరుగుదల ఉంటోంది. అదే బొగ్గు గని కార్మికుల పెన్షన్​కు అతీగతిలేకుండా పోయింది. రూ.10 వేలు కనీస పెన్షన్​ఇవ్వాలంటూ బొగ్గు గనుల రిటైర్డు కార్మికులు, వారి కుటుంబాలు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నాయి.

 భిక్షాటన మొదలు ధర్నాలు, రాస్తారోకోలు, ఆఫీసులు, అసెంబ్లీ ముట్టడి, సీఎంలను  కలవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో జంతర్​మంతర్, సీఎంపీఎఫ్​ట్రస్ట్​బోర్డు సమావేశం సమయంలో సైతం ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

పెన్షన్ పెంపు కోసం ఎంపీ వంశీకృష్ణ కృషి

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్​ విధానం తీసుకురావడంలో కాకా వెంకటస్వామి చొరవ చూపారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ప్రత్యేక పీఎఫ్,  పెన్షన్​ సౌకర్యం అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన మనవడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్​ను పెంచాలంటూ,  కనీస పెన్షన్​ రూ.10 వేలు ఇవ్వాలని ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు టన్ను బొగ్గుకు రూ.20 సీఎంపీఎఫ్​కి కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. 

ఇయ్యాల రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

సింగరేణి రిటైర్డ్ కార్మికులు తమ డిమాండ్ల సాధన, సంక్షేమం, సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మంచిర్యాల జిల్లా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్​అసోసియేషన్​ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్​నస్పూర్​లోని సింగరేణి గార్డెన్స్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. 

ప్రధానంగా పెన్షన్ స్కీమ్ ను సవరించి కనీస పెన్షన్​ రూ.15 వేలు చెల్లించాలని, మూడేళ్లకోసారి సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్​మెడికల్​ స్కీం వైద్య ఖర్చుల పరిమితిని అపరిమితం చేయాలని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో సైతం చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరుతున్నారు. సొంత ఇల్లు లేని కార్మికులకు హైదరాబాద్​పరిసర ప్రాంతాల్లో డబుల్​బెడ్​రూం ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మందులకు కూడా సాల్తలేవ్ 

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5 గనిలో కోల్ ఫిల్లర్ గా పనిచేసి 2001లో దిగిపోయా. నెలకు రూ.866 పెన్షన్ వస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న. నాకు వచ్చే పింఛన్ పైసలు మందులు కొనుక్కోవడానికి కూడా సాల్తలేవ్. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. వాళ్లంతా కూలి పని చేసుకొని ఎవరికివాళ్లు బతుకుతున్రు. నన్ను సాదే పరిస్థితి లేదు. కూలికి పోదామంటే శాతనైతలేదు. ఆఫీసర్లు దయచూపి పెన్షన్ పెంచాలె.  


- రేకుల రామస్వామి, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు