గుజరాత్‎లో రూ.35 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు స్టార్ట్.. చిప్స్ నుంచి షిప్స్ వరకు ఇక్కడే తయారీ

గుజరాత్‎లో రూ.35 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు స్టార్ట్.. చిప్స్ నుంచి షిప్స్ వరకు ఇక్కడే తయారీ

చిప్స్ నుంచి షిప్స్ వరకు ఇక్కడే తయారీ
వడోదర సభలో ప్రధాని నరేంద్ర మోదీ
కాంగ్రెస్‌‌‌‌, రాహుల్‌‌‌‌ గాంధీపై పరోక్షంగా ప్రధాని విమర్శలు

 
వడోదర: భారతదేశం ఇప్పుడు ‘చిప్స్ నుంచి షిప్స్’ (సెమీకండక్టర్ల నుంచి నౌకల వరకు) తయారీ శకంలోకి ప్రవేశిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా తయారయ్యే ఉత్పత్తులు, కీలక విడిభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులను విస్తరిస్తున్నామని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం వడోదరలో జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.35,000 కోట్ల విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. 

ఈ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన 2,800 కిలోమీటర్ల పొడవైన డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌‌‌‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా రూపొందించిన డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ను 21వ శతాబ్దపు చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ రైల్వే కనెక్టివిటీకి నోచుకోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ, సప్లై చైన్​ను పటిష్టం చేయడంలోనూ గుజరాత్‌‌‌‌ను ప్రధాన కేంద్రంగా మలచుకుంటూ ఈ ప్రాజెక్టులను వేగవంతం చేశామని పేర్కొన్నారు.

యూపీఏ పాలనపై తీవ్ర విమర్శలు

యువతను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా చురకలు అంటించారు. ‘‘అబద్ధాల హోరు (ఝూట్ కీ గూంజ్) ద్వారా మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. కానీ దేశ యువత ఎప్పటికీ నిజం పక్షానే నిలుస్తుంది’’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ‘చాత్రోం కీ గూంజ్’ ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును పోలుస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. 

‘‘ఇటీవల ముంబై (జేఎన్‌‌‌‌పీటీ) నుంచి వడోదరకు డబుల్ డెక్కర్ కంటైనర్ గూడ్స్ రైలును నడిపాం. ఒక్క ట్రిప్పుతోనే దాదాపు 250 ట్రక్కులకు సమానమైన సరుకు రవాణా జరిగింది. వెంటనే ఈ నారాజ్ ఫూఫా (అలిగిన పెద్దమనిషి) తరహా వ్యక్తులు రంగంలోకి దిగి.. మరి ట్రక్కు డ్రైవర్ల గతేంటి..? కొనుగోలు చేసిన ట్రక్కులు ఎక్కడికి పోవాలి..? అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెడతారు’’ అని ఎద్దేవా చేశారు.

ఫ్రైట్ కారిడార్​కు 2004 లోనే బీజం

2014కు ముందు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనుల్లో ఒక్క కిలోమీటరు కూడా పూర్తి కాలేదని గుర్తుచేశారు. ఈ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టుకు అటల్ బిహారీ వాజ్‌‌‌‌పేయి హయాంలోనే (2004లో) బీజం పడిందని, అయితే ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం పదేండ్లపాటు దీనిపై ఎలాంటి ముందడుగు వేయలేదని విమర్శించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పనుల్లో వేగం పుంజుకుందని స్పష్టం చేశారు. ‘‘2014 తర్వాత భారత్ 50 వేల ఆధునిక రైల్వే కోచ్‌‌‌‌లను తయారు చేసింది. కానీ గత ప్రభుత్వం పదేండ్లలో కనీసం 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది”అని మండిపడ్డారు. 

పోటీ పరీక్షల విద్యార్థులకు ఉచిత కోచింగ్

పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని మోదీ ప్రకటించారు. దేశంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రముఖ నిపుణులతో ఉచిత ఆన్‌‌‌‌లైన్ కోచింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. నేటి తరం కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా నైపుణ్య సాధనపై దృష్టి సారించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నవ్‌‌‌‌సారిలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను మోదీ ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలకు అధికారం ప్రజాసేవ కోసమే తప్ప 
అహంకారం కోసం కాదని స్పష్టం చేశారు.

ప్రజల దృష్టిమళ్లించేందుకే: కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ప్రతిసారీ కొత్త కొత్త పదాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ‘‘నారాజ్ ఫూఫా, దిమాగీ నక్సల్, అర్బన్ నక్సల్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్, ఆందోళన్‌‌‌‌జీవి, పరాన్నజీవి... ఇలా పేర్లు మారుతున్నాయి తప్ప, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మారడం లేదు. విద్యార్థులకు దూరమైనప్పుడు మాత్రమే ఇలాంటి ఔట్‌‌‌‌రీచ్‌‌‌‌లు అవసరమవుతాయి’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.