సాగర్ (భోపాల్): మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం (హూచ్) తాగి 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో మంగళవారానికి మృతుల సంఖ్య 15కి చేరినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు అక్రమ మద్యం కేసులో నిందితుడు కావడం గమనార్హం. ప్రస్తుతం సుమారు 40 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు ఉండగా, ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అనురాగ్ సుజానియా వెల్లడించారు. కల్తీ మద్యం వల్ల గుగ్రా ఖుర్ద్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని మృతుడు భగవాన్ సింగ్ భార్య సుమన్ సింగ్ కన్నీటిపర్యంతమయ్యారు.
అక్రమ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం
ఈ ఘటనపై స్పందించిన యంత్రాంగం అక్రమ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతోంది. బాధితుల కుటుంబాల ఫిర్యాదు మేరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని సాగర్ రేంజ్ డీఐజీ శశీంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎక్సైజ్ అధికారులు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
మద్యం తాగిన తర్వాత ఎవరికైనా వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. మరోవైపు, ఈ ఘటనపై హైలెవల్ విచారణ జరిపించాలని, అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన కోరారు.
