దండేపల్లి, వెలుగు : ఓ యువకుడు గొడ్డలితో నరికి మహిళను హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సింగతి లచ్చన్న, లక్ష్మి (45) భార్యాభర్తలు. లచ్చన్న పెద్దనాన్న కొడుకు రమేశ్ మంగళవారం రాత్రి లక్ష్మి ఇంట్లోకి వెళ్లి గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, రమేశ్ భార్య కొంతకాలంగా కాపురానికి రావడం లేదు. ఇందుకు లక్ష్మి మంత్రాలు చేయడమే కారణమని అనుమానం పెంచుకున్న రమేశ్ ఈ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
