ట్రాన్స్ జెండర్ల అప్లికేషన్లు కూడా తీసుకోండి..పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

ట్రాన్స్  జెండర్ల అప్లికేషన్లు కూడా తీసుకోండి..పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  బోర్డుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : పోలీసు కానిస్టేబుళ్లు, సబ్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల నియామకాల్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల అప్లికేషన్లను కూడా తీసుకోవాలని పోలీస్  రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. లింగాన్ని పురుషుడు, స్త్రీగా మాత్రమే వర్గీకరించే విధానానికి భిన్నంగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లతో పాటు అందరికీ అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు, ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. 

దరఖాస్తుల పోర్టల్‌‌‌‌‌‌‌‌లో లింగాన్ని పురుషుడు లేదా స్త్రీగా మాత్రమే పేర్కొనే విధానాన్ని సవాలు చేస్తూ దేవత్‌‌‌‌‌‌‌‌ తనుశ్రీతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తు ప్రారంభ దశలోనే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లు తమ లింగాన్ని పురుషుడు లేదా స్త్రీగా పేర్కొంటూ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. 

వాదనలు విన్న ధర్మాసనం.. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అవకాశం లేకపోతే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల నుంచి భౌతికంగా దరఖాస్తులను తీసుకొని, వాటిని ధ్రువీకరించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసింది.

 ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఎం ప్రవేశాల్లోనూ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు హారిజాంటల్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలంటూ దాఖలైన మరో పిటిషన్‌‌‌‌‌‌‌‌పై కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ అమలు చేయకపోవడాన్ని సవాలు చేసిన ఆ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.