- మహిళా పోలీసుల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించారు
- మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, వారి సమక్షంలోనే అర్ధనగ్న ప్రదర్శనకు దిగి అనుచితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ ను కోరారు. మంగళవారం హైదరాబాద్ బుద్ధభవన్ లోని రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్‌కు వెళ్లి కమిషన్ సభ్యులకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. డ్యూటీలో ఉన్న మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ పురుష ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు. మహిళా పోలీసులు ఎదురుగా నిలబడి ఉండగా వారి సమీపంలోకి వెళ్లి వస్త్రాలు విప్పేయడం, అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేయడం, చేతులతో వారిని నెట్టివేస్తూ తోపులాటకు దిగడం వంటి చర్యలు అత్యంత హేయమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియో సాక్ష్యాధారాలను మహిళా కమిషన్‌కు అందజేసినట్లు ఆమె తెలిపారు.
ఈ వీడియోలను నిశితంగా పరిశీలించి, మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, మహిళా పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, శశికళ యాదవ రెడ్డి, కుమారి సదా లక్ష్మి, రాధా బాయి, ఉజ్మా షకీర్, కమిషన్ కార్యదర్శి పద్మజా రమణ ఫిర్యాదును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యశస్వినీ రెడ్డి, పర్ణికారెడ్డి, రాగమయి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాలువ సుజాత, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ పాల్గొన్నారు.
