- హైకమాండ్ పరిశీలనలో సీనియర్ దళిత నేత పేరు
- ఉన్నత చదువుల కోసం 10 నెలలు లండన్ వెళ్లనున్న మీనాక్షి నటరాజన్
- మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్ పేరును హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం 10 నెలల పాటు లండన్ వెళ్తున్నారు. ఇందుకోసం ఆమె ఇప్పటికే హైకమాండ్ అనుమతి కోరారు. ఆమె స్థానంలో తెలంగాణ ఇన్‌చార్జీగా ముకుల్ వాస్నిక్‌ను పంపాలన్నది హైకమాండ్ ఆలోచనగా భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని రాంటెక్ కు చెందిన దళిత నేత ముకుల్ వాస్నిక్ ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షునిగా, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్న ఆయన ఇక్కడ ప్రభుత్వం, పార్టీని సమన్వయం చేస్తూ పనిచేస్తారని హైకమాండ్ భావిస్తోంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో అప్పటి వరకు ఆయననే కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపరంగా ఏవైనా కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సివస్తే సీఎం తదితరులతో చర్చించేందుకు సీనియర్‌నేత అయిన ముకుల్ వాస్నిక్ అవసరమని హైకమాండ్ భావనగా చెప్తున్నారు.
మీనాక్షి నటరాజన్ 2025 ఫిబ్రవరి నుంచి ఇన్‌చార్జిగా ఉన్నారు. గాంధేయవాది అయిన ఆమె పార్టీని పటిష్టపరిచేందుకు చాల సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఆమె ప్రయత్నించారు. తెలంగాణకు సంబంధించిన కేసు కారణంగా ఆమె రాజ్యసభ అవకాశాన్ని కూడా కోల్పోయారు. అప్పట్లోనే ఆమె బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించారు. కొంతకాలం కింద తనను పంజాబ్ ఇన్‌చార్జిగా పంపాలని ఆమె కోరినట్టు తెల్సింది.
పంజాబ్‌లో త్వరలో ఎన్నికల జరగనున్నందున పార్టీ వ్యవహారాలను పరిశీలించేందుకు ఆమె మూడు నెలలుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆమె పూర్తిస్థాయిలో పంజాబ్ ఇన్‌చార్జిగా వెళ్తారని అనుకుంటున్న సమయంలోనే హయ్యర్ స్టడీస్కోసం లండన్ వెళ్తుండడంతో ముకుల్ వాస్నిక్ పేరు తెర పైకి వచ్చింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్భేటీలో రాష్ట్ర ఇన్‌చార్జీ మార్పు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
