- ఘటనలో వాస్తవాలు బయటకు రావాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మహిళా ఎమ్మెల్యేలను ముందుపెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ ను దూషించి ఇపుడు మాట మారుస్తున్నారన్నారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో వాస్తవాలు బయటకు రావాలని ఆమె అన్నారు. “మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలి. పొట్టకూటి కోసమో, లేక ప్యాషన్ తోనే మహిళలు పోలీసులు అయితే.. వారిపై చేతులు వేసి అవమాన పరుస్తారు. మహిళా పోలీసుల మీద కేటీఆర్ చేతులు వేశారు. కావాలంటే విజువల్స్ సభకు సమర్పిస్తా. మహిళా పోలీసుల మీద చేతులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. హరీశ్ రావును మాటలు అన్నారని కవిత ను పార్టీ నుంచి బహిష్కరించి ఇపుడు మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదన్నారు.
విచారణ వ్యక్తం చేయలేదు: మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఇతర వివరాలు ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్, సీఎం పోలీసులను ఆదేశించారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఆ వీడియోలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్పీకర్ ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించి కనీసం విచారణ వ్యక్తం చేయకపోవటం బాధాకరమన్నారు. మాట్లాడే హక్కు ఉందని స్పీకర్ ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ వ్యవహారాల మంత్రులుగా పనిచేసి సభ ఎలా జరగాలో స్పీకర్ కు చెబుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. స్పష్టంగా వీడియోల్లో ఏం అన్నారో అందరూ చూశారని, అయినా తప్పును ఒప్పుకోవటం లేదని తెలిపారు.
స్పీకర్‌ను అవమానిస్తే సహించం.. ముందు క్షమాపణ చెప్పాలి: మంత్రి అడ్లూరి
స్పీకర్‌ను అవమానించిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌కు పశ్చాత్తాపమే లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ‘తాతా మధు వ్యాఖ్యలపై హరీశ్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని అనుకున్నాం.. కానీ, విచారం కూడా వ్యక్తం చేయలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు. “ స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడం. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి ఉంటే చర్యలు తప్పవు. ఆ ఘటనపై విచారణ జరుగుతోంది. తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు స్పీకర్‌పై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి” అని అన్నారు.
