హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు.. తమకు యాజమాన్యం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో మంగళవారం ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు రిటైర్డ్ ఉద్యోగులను అసెంబ్లీకి వచ్చే దారిలోనే ఇటు నాంపల్లి, అటు లక్డీకపూల్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో అడ్డుకొని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో రిటైర్డ్ ఉద్యోగులను అరెస్టు చేసే టైంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారిని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు వెంకటరెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, రంగారావు, మహేశ్ మీడియాతో మాట్లాడారు. వృద్ధప్య సమస్యలతో బాధపడుతున్న తమను ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
