న్యూఢిల్లీ: ‘కరెక్ట్ ది మ్యాప్' తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి రిలీజ్చేసిన కొత్త వరల్డ్ మ్యాప్ తీవ్ర చర్చనీయాంశమైంది. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లోని అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్, చైనాల సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా ఈ మ్యాప్ చూపుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును తొలగించి.. ఆ ప్రాంతాన్ని అస్సాం, చైనాతో సరిహద్దులు కలిగిన స్వతంత్ర రాజ్యంగా చూపించారు. అలాగే, అక్సాయ్ చిన్‌ను కూడా ఒక స్వతంత్ర ప్రాంతంగా చూపుతూ, దాని పశ్చిమ భాగాన్ని భారత్‌తో, తూర్పు భాగాన్ని చైనాతో సరిహద్దుగా పేర్కొంది.
ఈ మార్పులకు గల కారణాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించలేదు. అదే విధంగా భారత్, పాకిస్తాన్ మధ్య జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తున్న నియంత్రణ రేఖను కూడా ఈ మ్యాప్‌లో చుక్కల గీతతో చూపించారు. అయితే, ‘జమ్మూకాశ్మీర్‌లోని ఈ చుక్కల రేఖ భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించిన నియంత్రణ రేఖను సూచిస్తుంది’ అని ఐక్యరాజ్యసమితి మ్యాప్ ఫుట్నోట్లలో పేర్కొంది. జమ్మూకాశ్మీర్ తుదిస్థితిపై ఇరు పార్టీలు ఇంకా ఒక అంగీకారానికి రాలేదని తెలిపింది.
ప్రపంచ ప్రాంతాలు, ముఖ్యంగా ఆఫ్రికాకు సంబంధించిన సరైన, సమగ్రమైన కార్టోగ్రాఫిక్ ప్రాతినిధ్యాన్ని కోరుతూ ఆఫ్రికన్ యూనియన్ మద్దతుతో ‘కరెక్ట్ ది మ్యాప్’ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గత వారం ఆమోదించింది. ఈ తీర్మానానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. అయితే, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారతదేశ సార్వభౌమ భూభాగాన్ని భారత్ అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని.. ఎలాంటి తప్పుదోవ పట్టించే చిత్రణ ఆమోదయోగ్యం కాదని సూచించింది. అయితే, తాజా మార్పులపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
