శ్రీలంకలో ఎల్నినో ప్రభావం..తాగునీటి కోసం అల్లాడుతున్న 1.15 లక్షల మంది

శ్రీలంకలో ఎల్నినో ప్రభావం..తాగునీటి కోసం అల్లాడుతున్న 1.15 లక్షల మంది
  • రుగుతున్న ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న వర్షపాతం
  • దేశంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు

కొలంబో: శ్రీలంకలో ఎల్​నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎల్​నినో పరిస్థితులతోపాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 1.15 లక్షలకు పైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అజిత్ విజెమన్న మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్​నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయని, దీని ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ సెంటర్ (డీఎంసీ) ప్రకారం.. శ్రీలంకలోని 25 జిల్లాల్లో ఏడింటిలో ఈ ప్రభావం ఉంది. ప్రస్తుతం 1,15,534 మంది ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు డీఎంసీ అధికారి ప్రగీత్ దానన్సూరియ తెలిపారు.

భారీగా తగ్గుతున్న నీటి మట్టాలు..

అనురాధపుర జిల్లాలోని ఎరువెవ రిజర్వాయర్‌‌లో 3,500 ఎకరాల అడుగుల సామర్థ్యం ఉండగా, అది కాస్తా 1,000 ఎకరాల అడుగులకు పడిపోయింది. మాతలే, నందికడల్ ప్రాంతాల్లోనూ నీటి మట్టాలు భారీగా తగ్గాయి. ఈ పొడి వాతావరణం జలచరాలు, వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముల్లైతివు లాగూన్‌‌లో సముద్ర, మంచి నీరు కలవడం వల్ల వేలాది చేపలు మృతి చెందాయి. సహజ నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాయి. వర్షాభావం వల్ల వరి, కొబ్బరి, అరటి, జామ తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. అయితే, సెప్టెంబర్ చివరి నాటికి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.