‘శుద్ధీకరణ’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు.. స్టేషన్‌‌లో నిర్బంధంపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

‘శుద్ధీకరణ’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు.. స్టేషన్‌‌లో నిర్బంధంపై ఎంపీ  వంశీకృష్ణ ఆగ్రహం
  • పార్లమెంట్ స్టీట్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
  • ఎస్‌‌హెచ్‌‌వోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేత
  • దాదాపు 3 గంటల నిర్భంధం.. తర్వాత కేసు నమోదు
  • స్టేషన్‌‌లో నిర్బంధంపై ఎంపీ  వంశీకృష్ణ ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తరాఖండ్‌‌లోని హల్ద్వానీలో  ఇటీ వల కాంగ్రెస్‌‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ఒక సభావేదికను ‘‘శుద్ధీకరించిన’’ ఘటనకు సంబంధించి ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖర్గేను 'శుద్ధి' పేరుతో కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని అక్బర్ రోడ్ 24 పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తొలి భేటీ జరిగింది. 

ఎంపీ మల్లు రవి, ఇతర సీనియర్ నేతల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఎంపీ వంశీకృష్ణ, బలరాం నాయక్​తో సహా 20 మందికి పైగా ఎంపీలు హాజరయ్యారు. ఇందులో భాగంగా హల్ద్వానీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుతో పాటు ‘శుద్దీకరణ’ కు వ్యతిరేకంగా ఈ నెల 12న జంతర్ మంతర్ లో భారీ ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. భేటీ అనంతరం పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు ఎంపీలు వెళ్లారు.

3 గంటల నిర్బంధం
హల్ద్వానీ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎంపీ లను పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్ మెయిన్ గేట్ వద్దే వారిని లోపలికి రాకుండా భారీ కేడ్లు వేశారు. మరో వైపు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. లోపలికి వెళ్లి కంప్లైంట్ చేసేందుకు ఎంపీలు ప్రయత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో ఎంపీలను లోనికి అనుమతించారు. ఖర్గేను 'శుద్ధి' పేరుతో కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌‌హెచ్‌‌వోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.

ఈ హల్ద్వానీ ఘటనపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ సంబంధించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే... స్టేషన్ ఎస్‌‌హెచ్‌‌వో మాత్రం ఎంపీల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎంపీలను దాదాపు మూడు గంటల పాటు నిర్భందించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ... ఎస్‌‌హెచ్‌‌వో తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అట్రాసిటీ చట్టంలోని పలు నిబంధలను లేవనెత్తారు.

ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు సభలో ప్రసంగించారన్న అక్కసుతో మైదానాన్ని 'శుద్ధి' చేయడం అంటరానితనాన్ని, కులవివక్షను బహిరంగంగా ప్రోత్సహించడమేనని మల్లు రవి రెండు పేజీల కంప్లైంట్ కాపీలో ప్రస్తావించారు. హల్ద్వానీలో ఆగస్టు 8న ఖర్గే సభ నిర్వహించిన గ్రౌండ్ లో 'శ్రీ రామ్ ధర్మర్థ సేవా న్యాస్' అధ్యక్షుడు గిరీశ్​ చంద్ర పాండే యజ్ఞం నిర్వహించి, గంగాజలం చల్లి 'శుద్ధి' కార్యక్రమం చేపట్టారని ఫిర్యాదులో గుర్తు చేశారు.ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. ఘటనపై బాధ్యులైన గిరీష్ చంద్ర పాండేతో పాటు ఇతరులపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో మల్లు రవి కోరారు.
 
రాజ్యాంగమా? మనుస్మృతా ?: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
‘శుద్ధీకరణ’ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ చేతులు కట్టేశారని, తామేమి చేయలేకపోతు న్నామని పోలీసులు సమాధానం ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పేపర్, కంప్యూటర్ లేదు అంటూ ఎఫ్ఐఆర్ చేసేందుకు ఎస్‌‌హెచ్‌‌వో నిరాకరించారన్నారు.

కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు స్టేషన్ నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారని చెప్పారు. ‘20 మంది ఎంపీలు వచ్చి కూర్చున్నా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరా? మీ పోలీస్ స్టేషన్ రాజ్యాంగాన్ని పాటిస్తోందా? లేక మనుస్మృతినా అని ప్రశ్నించాం.

జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కామన్ మ్యాన్ హక్కు. 20 మంది దళిత, ఎస్టీ ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు కోరుతాం’ అని చెప్పారు. దీంతో 3 గంట ల నిర్భంధం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంత మంది ఎంపీలు ప్రశ్నిస్తేనే.. ఇలాంటి పరిస్థితి ఉంటే దేశంలో సామాన్యుడి పరిస్థితి ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ పాలనలో పోలీస్ వ్యవస్థ నడుస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరిగినా పోరాటం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు.