- సభా హక్కుల ఉల్లంఘన, ధిక్కరణ కింద చర్యలకు చాన్స్
- మండలి చైర్మన్‌కు విచక్షణ అధికారాలు
- వీడియో సాక్ష్యాలు ఉన్నందున అసెంబ్లీ తీర్మానం
- రూల్స్‌కు అనుగుణంగా చర్యలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం కనిపిస్తున్నది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా, అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి గౌరవానికి భంగం కలిగించేలా వీరిద్దరూ మాట్లాడారని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి.. మండలికి పంపడం ఇందుకు ఊతమిస్తున్నది.
వాస్తవానికి సభా విధానాలు, సభా హక్కుల ఉల్లంఘన నిబంధనల ప్రకారం శాసనసభాపతి లేదా శాసనమండలి చైర్మన్ గౌరవానికి భంగం కలిగించడాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం శాసనసభ్యులకు, మండలి సభ్యులకు సభా హక్కులు, రక్షణలు ఉంటాయని స్పష్టంగా ఉన్నప్పటికీ.. అదే నిబంధన ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే పూర్తి విచక్షణాధికారం కూడా సభకే ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ శాసనమండలి ‘రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్’ నియమావళిలోని చాప్టర్-19, రూల్ నెంబర్ 168 నుంచి 186 వరకు ఉన్న నిబంధనలు సభా హక్కుల ఉల్లంఘన ప్రక్రియను స్పష్టంగా నిర్వచిస్తున్నాయని, రూల్ 169 ప్రకారం స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా వ్యవహరించడం ‘కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్’ (సభా ధిక్కరణ) కిందికి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
చైర్మన్‌కు పూర్తి విచక్షణాధికారాలు
శాసనమండలి రూల్ 179.. చైర్మన్‌కు పూర్తి విచక్షణాధికారాలు కల్పిస్తోంది. దీని ప్రకారం ఏదైనా అంశం సభ గౌరవానికి, రాజ్యాంగ వ్యవస్థల ఉనికికి తీవ్ర భంగం కలిగించేలా ఉందని భావిస్తే.. ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా ప్రివిలేజ్ కమిటీ నివేదిక కోసం వేచి చూడకుండానే చైర్మన్ నేరుగా సభలో తీర్మానం ద్వారా చర్యలు చేపట్టే వీలుంటుంది. రూల్ 180 ప్రకారం మండలి ప్రివిలేజెస్ కమిటీకి దర్యాప్తు అధికారాన్ని అప్పగించడమే కాకుండా, విచారణ వేగవంతం చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని కూడా చైర్మన్ నిర్దేశించవచ్చు.
వీటన్నింటినీ మించి మండలి రూల్ బుక్‌లోని చాప్టర్-28 కింద గల ‘రెసిడ్యువరీ పవర్స్’ (రూల్ 311) చైర్మన్‌కు విస్తృతమైన ప్రత్యేక అధికారాలను కట్టబెడుతోంది. రూల్ బుక్‌లో స్పష్టంగా లేని అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు, సభా గౌరవాన్ని కాపాడేందుకు సదరు సభ్యులపై తాత్కాలిక నిషేధం విధించడమా? లేదంటే తక్షణమే సభ్యత్వాన్ని రద్దు చేసేలా సభలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడమా? అనే విషయంలో చైర్మన్ తీసుకునే నిర్ణయమే అంతిమం కానుంది.
కాగా ప్రస్తుత వ్యవహారంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు మాట్లాడిన దృశ్యాలు రికార్డెడ్ వీడియోల్లో స్పష్టంగా ఉన్నందున మండలి చైర్మన్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారే అవకాశముంది. భవిష్యత్తులో న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నోటీసులు జారీ చేస్తారా? లేక నేరుగా ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తారా? లేదంటే ఉన్న ఆధారాలతో సభ్యత్వం రద్దు చేస్తారా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
2018లో ఇద్దరు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
గతంలో శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లపై శాసనసభలు తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న న్యాయపోరాటాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత, 2018 మార్చి 12న ఉభయ సభలను ఉద్దేశించి అప్పటి ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా ఈ తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్‌ఫోన్.. పోడియంపై ఉన్న శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ కంటికి తగిలిందని ఇది హింసాత్మక చర్యగా, తీవ్ర సభా ధిక్కరణగా పరిగణించారు.
మరుసటి రోజు అంటే మార్చి 13న అప్పటి శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్ రావు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ (అలంపూర్) శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నోటిఫికేషన్ కూడా వెంటనే గెజిట్‌లో ప్రచురితమైంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు నోటీసులు, వివరణ తీసుకోకుండా సభ్యత్వాలు రద్దు చేశారంటూ వారు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బి. శివశంకరరావు నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం 2018 ఏప్రిల్ 17న తీర్పునిస్తూ.. ఆ ఇద్దరి శాసనసభ్యత్వాల రద్దు తీర్మానాన్ని కొట్టివేసి, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు అమలు కాలేదు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ సభ్యత్వాలను పునరుద్ధరించకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులుపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే అసెంబ్లీ సెక్రటరీపై అభియోగాలు మోపి, జైలుకు పంపాల్సి ఉంటుందని న్యాయస్థానం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. కానీ ఆ లోపే 2018 సెప్టెంబర్ 6న శాసనసభను ముందస్తుగా అప్పటి సీఎం రద్దు చేశారు. పరిణామాలన్నీ పరిశీలిస్తే.. సభాధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలు, దాడుల విషయంలో ఉభయ సభలు గతంలోనూ కఠిన చర్యలకు ఉపక్రమించాయని స్పష్టమవుతున్నది.
