- సభకు రాని ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: బండి సంజయ్
- ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హతను బీఆర్ఎస్ ఎప్పుడో కోల్పోయింది
- మహిళా పోలీసులపై చేయిచేసుకున్న వాళ్లని అరెస్ట్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సభకు రాకుండా కేసీఆర్ కలుగులో దాక్కున్నారని, అసెంబ్లీకే రాని ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగే అర్హతను కూడా ఎప్పుడో కోల్పోయిందని పేర్కొన్నారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌పై దాడి, కేసీఆర్‌పై హత్యాయత్నం అనేది ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రెండు పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి, బజారు భాషతో సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
స్పీకర్‌ను బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ జీర్ణించుకోలేరని, తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకొని, దాడికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
గతంలో తన తలను ఆరు ముక్కలు చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. దమ్ముంటే ఎర్రవల్లిలోనైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేసీఆర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుసరించిన తీరు హేయనీయమని, అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు రక్తం కారేలా లాఠీచార్జీ చేయడం, అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.
సమస్యలపై చర్చించండి
అసెంబ్లీలో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి రెండు రోజులపాటు ఒకే అంశంపై చర్చ పేరుతో విలువైన సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు. 22ఏ నిబంధన వల్ల ప్రజలు అల్లాడిపోతుంటే.. మంత్రులు, అధికార పార్టీ నేతలు వేల కోట్ల భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక లక్షలాది మంది విద్యార్థులు, సాగునీరందక దక్షిణ తెలంగాణ రైతాంగం, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, డీఏలు అందక ఉద్యోగులు, నిత్యావసర ధరల పెరుగుదలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన శాసనసభను తమ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
