ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇచ్చేందుకు లంచం..ఏసీబీ అదుపులో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి

ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇచ్చేందుకు లంచం..ఏసీబీ అదుపులో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి

ఊట్కూర్(నారాయణపేట) వెలుగు : ఇంటి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పేపర్లు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన నారాయణపేట సబ్ రిజిస్ట్రార్, మరో వ్యక్తిని ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి తన ఇంటి రిజిస్ట్రేషన్ కోసం గతంలో నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సంప్రదించాడు.

 రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామి రూ. 90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు జూలై 21న ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేశ్ ద్వారా రూ.50 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ. 40 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తామని ఆఫీసర్ స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు వారం కింద నాగేశ్ ను కలిసి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. 

అనంతరం బాధిత వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించిన ఏసీబీ ఆఫీసర్లు మంగళవారం నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో తనిఖీలు చేశారు. డబ్బులు తీసుకున్న సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తి నాగేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.