మహిళా సిబ్బంది ఆందోళన.. ఈఫిల్ టవర్ మూసివేత

మహిళా సిబ్బంది ఆందోళన.. ఈఫిల్ టవర్ మూసివేత

పారిస్: ప్రముఖ హిందూ సంస్థ బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్) ప్రతినిధుల బృందం ఈఫిల్ టవర్ సందర్శన వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను విధులకు దూరం చేశారనే ఆరోపణలతో పారిస్‌‌‌‌లోని ఈఫిల్ టవర్ సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్‎ను సోమవారం మూసివేశారు. 

పారిస్ సమీపంలో ఓ హిందూ ఆలయాన్ని ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌‌‌‌కు వచ్చిన బీఏపీఎస్‎కు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం గత శనివారం ఈఫిల్ టవర్‌‌‌‌ను సందర్శించింది. ఆ సమయంలో మహిళా ఉద్యోగులను పక్కన పెట్టాలని.. వారు కనిపించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని చోట్ల వారి స్థానంలో పురుషులను నియమించారు. 

అయితే, ఈ చర్యలను మహిళా సిబ్బంది తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు ఆందోళనకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్‎ను సోమవారం రోజంతా మూసివేశారు. అయితే, ఈ ఘటనపై బీఏపీఎస్ స్పందించింది. ‘మా ప్రతినిధి బృందం పెద్దదిగా ఉండటం వల్ల, ఇతర సందర్శకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈఫిల్ టవర్ బృందాల సమన్వయంతో ఈ సందర్శన జరిగింది.

మాకు తెలిసినంతవరకు, ఎవరికీ ఈఫిల్ టవర్ ప్రవేశం నిరాకరించలేదు. మహిళా సిబ్బందిని అక్కడి నుంచి పంపించిన విషయం తమ దృష్టికి రాలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘అయినప్పటికీ, ఈ పరిస్థితి ద్వారా ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే వారికి మేము హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాము. పరస్పర గౌరవం, ఇతరులకు సేవ చేయడం అనే సార్వత్రిక విలువలకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము’ అని పేర్కొంది.